ఈ తైలాలతో ఏకాగ్రత పెరుగుతుంది !

-

మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రతిరోజూ ధ్యానం చేయాలి. ధ్యానం చేద్దామని కూర్చోగానే పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్‌లో తిరుగుతున్నాయా? ఆ ఆలోచనల నుంచి ధ్యానంలో నిమగ్నమైపోవాలంటే ఈ తైలాలను వాడాలి.

ఈ రోజుల్లో మెడిటేషన్ చాలామంది చేయడం మొదలుపెడుతున్నారు. కానీ, కల్లు మూసుకోగానే కరెంట్ బిల్లు, ఇంటి అద్దెలు, ఆఫీస్ పనులు ఇంట్లో వంట ఇలా ఏవో గుర్తొస్తూ ఉంటాయి. అంతే.. ధ్యానం లేదు.. ఏమీ లేదు.. ఈ యోగా, మెడిటేషన్ ఏవీ మనకు సెట్ కావులే అనుకుంటూ లేచి పనులు చేసుకోవడం మొదలుపెడుతాం. ఏదైనా నేర్చుకోవాలంటే ఒక్కసారి వచ్చేస్తే అందులో మజా ఏం ఉంటుంది. రెండు మూడుసార్లు ఫెయిల్ అవ్వాలి. లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి. వాటిని అనుసరిస్తూ ముందుకు వెళ్తుంటే ఏ పనైనా వచ్చి తీరుతుంది. కాకపోతే కొనిసార్లు గడువు ఎక్కువగా తీసుకుంటుంది. మెడిటేషన్ కూడా అంతే.. మైండ్ కంట్రోల్‌లోకి వచ్చే వరకు ఓపిక పట్టాలి. కొన్ని నెలలపాటు ధ్యానం చేస్తుండాలి. అప్పుడే మనసుపై అదుపు వస్తుంది. మైండ్‌లో రకరకాల ఆలోచనలన్నీ తొలిగి ప్రశాంతత కలుగుతుంది. ధ్యానం చేయడం వల్ల మనలో బీపీ తగ్గుతుంది. బ్రెయిన్‌లో కణాలు ఉత్తేజితం అయి, ముసలితనం త్వరగా రాకుండా వాయిదా వేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. చెడు ఆలోచనలు తొలుగుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లాభాలున్నాయి.

తైలాలతో ఏకాగ్రత :
కొన్ని రకాల తైలాలు మనలో ఏకాగ్రతను పెంచుతాయి. ఈ తైలాలను చెట్లు, మొక్కలపూల నుంచి తయారు చేస్తారు. ఈ తైలాలను శరీరానికి రాసుకుంటే సువాసన వెదజల్లుతాయి. అప్పుడు ఆ వాసన పీల్చుతూ.. మనసు ధ్యానంలోకి వెళ్తుంది. శరీరానికి రాసుకోకపోయినా ధ్యానం చేసే గదిలో స్ప్రే చేసినా చాలు. ఆ సువాసనకు చక్కగా మెడిటేషన్ చెసుకోగలం.

గంధపు తైలం : గంధపు తైలానికి మనసును ప్రశాంతంగా ఉంచే గుణం ఉంది. ప్రాచీన కాలం నుంచి గంధంను రకరకాల పూజా కార్యక్రమంల్లో వాడుతున్నారు. గంధపు తైలం మైండ్‌ను ప్రశాంతంగా ఉంచడమే కాకుండా ఏకాగ్రతను పెంచుతుంది. ఈ తైలం వాసన పీల్చుతూ మెడిటేషన్ చేశామంటే.. ఇక మనసు హిమాలయాల్లో ఎగురుతున్నట్లుంటుంది.

లావెండర్ ఆయిల్ : ఈ పూల గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం వాటిని రకరకాల కాస్మొటిక్స్‌లో వాడుతున్నారు. ఎందుకంటే లావెండర్ ఆయిల్.. శరీరాన్ని రిలాక్స్ చేయ్యగలదు. ఈ తైలపు మృదుతత్వం మైండ్‌ను కూల్‌గా ఉంచుతుంది. ఎంత ప్రశాంతంగా మారిపోతామంటే.. పక్కన వాళ్లు రెచ్చగొట్టినా కామ్‌గా ఉంటాం. చెడు ఆలోచనలు, బాధలు, అశాంతి అన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి.

క్లారీ సేజ్ : ఇది ఒక రకమైన మొక్క. ఇది చెడు ఆలోచనలను తరిమికొట్టగలదు. ఇది మూడ్‌ను మార్చి ప్రశాంతంగా ఉంచుతుంది. ఏకాగ్రత పెంచుతుంది. మనసును శ్వాసపైనే ధ్యాస పెట్టేందుకు వీలు కలిగిస్తుంది. మెమరీ పవర్ పెంచే శక్తి కూడా దీనికి ఉంది.

ఈ మూడు తైలాలను రోజుకో రకం వాడినా చాలు.. ప్రశాంతమైన ధ్యానం మీ సొంతమవుతుంది. ఈ తైలాలను సూపర్‌మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. లేదంటే ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చుకోవచ్చు. కాస్తరేటు ఎక్కువైనా ఇవి కలిగించే ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు వీటిని కొనుక్కుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news