ఈ కరోనా సమయంలో రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవడానికి మార్గాలు…!

ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. మీరు ఆహారం తీసుకునేటప్పుడు పోషకాలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవడం మంచిది. అయితే ఎటువంటి ఆహరం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం..!

 

హైడ్రేట్ గా ఉండడం:

డీహైడ్రేషన్ కి గురవకుండా ఉండాలి కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల మంచినీళ్లు తీసుకోవడం ముఖ్యం. ఇలా చేయడం వల్ల బాడీలో ఉండే టాక్సిన్స్ తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మంచి నీళ్ల తో పాటు తాజాగా తయారు చేసే జ్యూసులు తీసుకోండి. అలానే సిట్రస్ ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు కూడా తీసుకోవడం మంచిది.

మంచి డైట్ పాటించడం:

మీరు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి వీలవుతుంది. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న మీల్స్ ని తీసుకోండి. దీని వల్ల బ్లడ్ ప్రెషర్ మరియు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

అదే విధంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఫిట్ గా ఉండటానికి వీలవుతుంది. రెగ్యులర్ గా తాజా కూరగాయలను పండ్లను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా బీటా-కెరోటిన్ మరియు అవసరమైన విటమిన్లు తీసుకోవడం మంచిది.

బ్రోకలీ, పాలకూర, పుట్టగొడుగులు, టమాటాలు వంటివి తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అలానే మీ ఆహార పదార్ధాలలో అల్లం, ఉసిరి, పసుపు, వెల్లుల్లి, తులసి ఆకులు, నల్ల జీలకర్ర తీసుకోవడం మంచిది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అదే విధంగా ఆహారంలో విటమిన్ ఈ ఉండేటట్లు చూసుకోండి.

సరైన నిద్ర ముఖ్యం:

ప్రతిరోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం మంచిది. తక్కువ నిద్ర పోవడం వల్ల మీకు టెన్షన్ పెరిగిపోతుంది. అలానే వీక్ అయిపోతారు. కాబట్టి సరైన నిద్ర చాలా ముఖ్యం.

వ్యాయామం చేయడం:

కనీసం రోజుకు 30 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. ప్రతి రోజు మీరు వ్యాయామం చేయడం వల్ల మెటబాలిజంను పెంపొందించుకోవడానికి వీలవుతుంది. అలానే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.