లిచి పండ్లలో ఉండే Methylene CycloPropyl Glycine (MCPG) అనే విష పదార్థం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ విష పదార్థం Hypoglycaemia (రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోవడం)ను కలిగిస్తుందట.
బీహార్‌లోని ముజఫర్ పూర్‌ను Acute Encephalitis Syndrome (AES) వణికిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 142 మంది చనిపోయారు. దీంతో పరిస్థితి రాను రాను మరింత ఉద్రిక్తంగా మారుతోంది. మరోవైపు ప్రభుత్వాలు నష్ట పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్నాయే తప్ప.. అసలు ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో, దానికి చికిత్స ఏమిటో కనిపెట్టలేకపోతున్నాయి. అయితే ఈ వ్యాధి వచ్చేందుకు పలు కారణాలను మాత్రం సైంటిస్టులు ఇప్పటికే అంచనా వేశారు. అవేమిటంటే…
Acute Encephalitis Syndrome (AES) అనేది వైరస్, బాక్టీరియా, ఫంగస్, ఇతర వ్యాధికారక క్రిములలో వేటి ద్వారా అయినా రావచ్చు. అలాగే Japanese Encephalitis (JE) అనే వైరస్ కూడా ఈ వ్యాధి వచ్చేందుకు కారణమవుతుంది. దీంతోపాటు టైఫాయిడ్, డెంగీ, గవద బిళ్లలు, తట్టు, నిపా, జికా వైరస్‌ల మూలంగా కూడా AES వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇవే కాకుండా లిచి పండ్లలో ఉండే Methylene CycloPropyl Glycine (MCPG) అనే విష పదార్థం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ విష పదార్థం Hypoglycaemia (రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోవడం)ను కలిగిస్తుందట. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్తారని, ఆపై AES వస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే బీహార్ లో AES కారణంగా మృతి చెందిన చిన్నారులకు పైన చెప్పిన ఏ కారణం చేత ఆ వ్యాధి వచ్చిందో సైంటిస్టులు అంచనా వేయలేకపోతున్నారు. అందుకనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని త్వరగా తేల్చాలని, సైంటిస్టులకు పరిశోధనలు చేయాలని ఆదేశించింది.
AES వచ్చిన వారిలో అనేక లక్షణాలు చాలా త్వరగా కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరుపై AES ప్రభావం చూపిస్తుంది. దీంతో మతి స్థిమితం రావడం, ఫిట్స్ రావడం, ఆందోళన, కంగారు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు ఈ స్థితిలో కోమాలోకి కూడా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఆ స్థితి రాకముందే ఆసుపత్రిలో చేర్పిస్తే వారు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే కేవలం AES వ్యాధి మాత్రమే కాదు, మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి వ్యాధులు వస్తే బలయ్యేది పేదలే. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు లేక 60 మంది చిన్నారులు మృత్యువాత పడితే.. ఆ తరువాత కేరళలో ప్రబలిన నిపా వైరస్‌కు 17 మంది చనిపోయారు. అలాగే గతేడాది దేశంలోని 17 రాష్ట్రాల్లో పైన చెప్పిన AES వల్లే 632 మంది చిన్నారులు చనిపోయారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే వ్యాధి ప్రబలింది. దీంతో ఈ నెలలోనే 142 మంది చిన్నారులు బీహార్‌లో చనిపోయారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు.
వ్యాధి ప్రబలినప్పుడు చనిపోయే చిన్నారుల కుటుంబాలకు నష్ట పరిహారం అందిండం.. సమస్య సద్దుమణిగాక ఎవరి దారి వారు చూసుకోవడం సర్వసాధారణం అయింది. ఇక వారు వ్యాధుల నిర్మూలనకు ఏం ప్రయత్నాలు చేస్తారు..? అది ప్రభుత్వాలు చేస్తాయని ఆశించడం మన అడియాశే అవుతుంది. ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను మెరుగు పరిస్తే భవిష్యత్తులోనైనా ఇలాంటి వ్యాధులు ప్రబలినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. లేకపోతే మళ్లీ ఇలాంటి దారుణాలనే చూడాల్సి వస్తుంది.!