ఎడారి ప్రాంతాన్ని ప‌చ్చని అర‌ణ్యంగా మార్చింది ఆ జంట‌..!

-

బ్రెజిల్‌కు చెందిన సెబాస్టియో స‌ల్గాడో అనే ఓ ఫొటోగ్రాఫ‌ర్ మినాస్ గెరాయిస్ అనే త‌న సొంత ఊరుకు చాలా కాలం త‌రువాత చేరుకున్నాడు. అయితే అక్క‌డ ఒక‌ప్పుడు అడవి ఉండేది. కానీ అత‌ను వ‌చ్చి చూసే స‌రికి మొత్తం ఎడారిలా మారింది.

నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నాయి. చూసేందుకు క‌నీసం ఒక్క చెట్టు కూడా క‌నిపించ‌డం లేదు. చెట్ల‌ను న‌రుకుతూ అడ‌వుల‌ను మాయం చేస్తున్నారు. దీంతో జీవ‌వైవిధ్యం దెబ్బ తిని అనేక జాతుల‌కు చెందిన జీవాలు అంత‌రించిపోతున్నాయి. అలాగే ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త కూడా దెబ్బ తింటోంది. ఏటా గ్లోబ‌ల్ వార్మింగ్ కార‌ణంగా వేస‌విలో ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయి. ఇంకా అనేక అనర్థాల‌ను మ‌న‌కు మ‌న‌మే కొని తెచ్చుకుంటున్నాం. ఈ క్ర‌మంలోనే వీటిని కొంత‌లో కొంతైనా నివారించేందుకు ఓ జంట న‌డుం బిగించింది. అందులో భాగంగానే వారు ఎడారిలా ఉన్న ప్రాంతాన్ని అన‌తి కాలంలోనే ప‌చ్చ‌ని అరణ్యంలా మార్చారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

బ్రెజిల్‌కు చెందిన సెబాస్టియో స‌ల్గాడో అనే ఓ ఫొటోగ్రాఫ‌ర్ మినాస్ గెరాయిస్ అనే త‌న సొంత ఊరుకు చాలా కాలం త‌రువాత చేరుకున్నాడు. అయితే అక్క‌డ ఒక‌ప్పుడు అడవి ఉండేది. కానీ అత‌ను వ‌చ్చి చూసే స‌రికి మొత్తం ఎడారిలా మారింది. క‌నుచూపు మేర‌లో ఒక్క చెట్టు కూడా క‌నిపించ‌లేదు. దీనికి తోడు అంత‌కు ముందు ఆ అడ‌విలో ఉండే అనేక అరుదైన జాతుల‌కు చెందిన వ‌న్య ప్రాణులు, జీవాలు కూడా మాయ‌మ‌య్యాయి. దీంతో సెబాస్టియో క‌ల‌త చెందాడు. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని ప‌చ్చ‌ని అర‌ణ్యంలా మార్చాల‌నుకున్నాడు. దీంతో వెంట‌నే త‌న భార్య లెలియా డిలూజ్ వానిక్‌తో క‌ల‌సి ఇనిస్టిట్యుటో టెర్రా అనే ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌ను ఏర్పాటు చేశాడు. దాంతో త‌మ ప్రాంతంలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కై శ్రీ‌కారం చుట్టాడు.

అలా సెబాస్టియో, అత‌ని భార్య క‌ల‌సి మినాస్ గెరాయిస్ లో మొక్క‌లు నాట‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే వారు ఆ ప్రాంతంలో 40 ల‌క్ష‌ల‌కు పైగా మొక్క‌ల‌ను నాటారు. గ‌త 20 ఏళ్లుగా వారు ఇదే ప‌నిచేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కాస్తా ప‌చ్చ‌ద‌నం సంత‌రించుకుంది. ఒక‌ప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే ప‌చ్చ‌ని చెట్ల‌తో ఆ ప్రాంతం మొత్తం అర‌ణ్యంలా మారింది. అప్ప‌టికి, ఇప్ప‌టికి ఆ ప్రాంతంలో వ‌చ్చిన మార్పును చూసి స్థానికులు కూడా ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక‌ప్పుడు ఎడారిలా ఉన్న ఆ ఊరు ఇప్పుడు అర‌ణ్యంలా మారింది. అదంతా సెబాస్టియో, అత‌ని భార్య‌ శ్ర‌మే అని చెప్ప‌వచ్చు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడా ప్రాంతం అనేక అరుదైన జాతుల‌కు చెందిన జీవ‌రాశుల‌కు నిల‌యంగా మారింది. ఏది ఏమైనా.. ఇంత‌టి శ్ర‌మ చేసినందుకు గాను సెబాస్టియో, అత‌ని భార్యను మ‌నం నిజంగా అభినందించాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news