గోవా అంటేనే.. అందమైన బీచ్ లకు ఫేమస్. బీచ్‌లో అలలను చూస్తూ బీర్ లాగిస్తే వచ్చే మజాయే వేరు. అయితే ప్రస్తుతం అక్కడ బహిరంగ మద్యపానాన్ని నిషేధించారు. కానీ ఎవరు చేసే పని వారు చేస్తున్నారు లెండి. అది వేరే విషయం. అయితే గోవా బీచ్‌లో గనక మీరు బీరు తాగాలంటే.. సాధారణంగా ఏం చేస్తారు ? బీరు కొని తాగుతారు, అంతే కదా. కానీ మేం చెప్పిన విధంగా చేస్తే మీరు ఉచితంగా అక్కడ బీరు తాగవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
గోవాలోని బాగా బీచ్‌లో ఈ మధ్యే కొత్తగా వేస్ట్ బార్ ను లాంచ్ చేశారు. వేస్ట్ బార్ అంటే.. ఆ బార్ చెత్త బార్ అనుకునేరు. అది కాదు. మరేమిటంటే.. గోవా బీచ్‌లో తాగి పడేసిన సిగరెట్లకు చెందిన పీక ముక్కలు, ఖాళీ బీరు సీసాలు, వాటి మూతలు, ప్లాస్టిక్ స్ట్రాలు తదితర చెత్తను తీసుకువెళ్లి సదరు వేస్ట్ బార్‌లో ఇస్తే ఎంచక్కా మీరు బీరు ఉచితంగా ఇస్తారు. అవును, అది నిజమే. 10 బీర్ బాటిల్ మూతలు లేదా 20 సిగరెట్ పీకలు ఇస్తే బీరు ఫ్రీగా ఇస్తారు. జనవరి 30 నుంచి ఈ బార్ అందుబాటులోకి వచ్చింది.
గోవా బీచ్‌లలో పేరుకుపోతున్న చెత్త, చెదారాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ వేస్ట్ బార్‌ను లాంచ్ చేసి అందులో పైన చెప్పిన విధంగా టూరిస్టులకు ఉచితంగా బీర్‌ను ఇస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఉచిత బీర్ కోసం సిగరెట్ పీకలు, ఖాళీ బీర్ సీసాలు, వాటి మూతలు తెచ్చి ఇస్తున్నారట. అయితే గతేడాది కూడా ఇలాగే ఓ బార్‌ను లాంచ్ చేసి 5 నెలల పాటు నడిపించగా, అది క్లిక్ అయిందట. అందుకనే మరోసారి ఈ వేస్ట్ బార్ కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చారు. ఏది ఏమైనా ఇలాంటి ఉపాయాలను అమలు చేస్తే అప్పుడు దేశంలో ఎక్కడ చూసినా చెత్తే కనిపించదు కదా..!