14 ఏళ్ల అమ్మాయి కన్నీటి గాథ.. అమ్మ కోసం షేక్ తో పెళ్లికి ఒప్పుకున్నా

-

అమ్మాయిల తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి… అమ్మాయిలను పెళ్లి పేరుతో దుబాయ్ తీసుకెళ్తారు. ముక్కపచ్చలారని అమ్మాయిలతో కాటికి కాళ్లు చాపే దుబాయ్ షేక్ లతో నిఖా జరిపిస్తారు.

హైదరాబాద్ లోని పాత బస్తీ. పేరుకు తగ్గట్టుగానే అక్కడ కొందరి బతుకులు ఇంకా పాతగానే ఉన్నాయి. వాళ్ల బతుకులు ఇంకా దుర్భరంగానే ఉన్నాయి. పాతబస్తీ గురించి మనకు తెలిసింది నాణేనికి ఒకవైపు మాత్రమే. మనకు తెలియని నాణేనికి రెండో వైపు కూడా ఉంది. పేద మైనార్టీ అమ్మాయిల గొంతు కోయడం. గొంతు కోయడం అంటే కత్తితోనే.. లేదా ఇంకేదో వస్తువుతో కోయడం కాదు. వాళ్లను దుబాయ్ షేక్ లకు ఇచ్చి పెళ్లి చేయడం. అవును.. అవి బలవంతపు పెళ్లిళ్లు. పేద అమ్మాయిలు, చదువుకోని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలే వాళ్ల టార్గెట్. అమ్మాయిల తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి… అమ్మాయిలను పెళ్లి పేరుతో దుబాయ్ తీసుకెళ్తారు. ముక్కపచ్చలారని అమ్మాయిలతో కాటికి కాళ్లు చాపే దుబాయ్ షేక్ లతో నిఖా జరిపిస్తారు. ఇది ఇప్పుడు ప్రారంభం అయిది కాదు.. దశాబ్దాల కాలంగా పాత బస్తీలో జరుగుతున్నదే. ఈ దందా పాతబస్తీతో భారీ ఎత్తున జరుగుతోంది.. అని చెప్పడానికి ఈ ఘటనే సాక్ష్యం.

Hyderabad Old city girl escaped from marrying dubai shaik and safe with Shaheen foundation

ఇలాగే పాత బస్తీకి చెందిన ఓ అమ్మాయికి కూడా దుబాయ్ షేక్ తో పెళ్లయింది. అసలు.. ఆ అమ్మాయికి దుబాయ్ షేక్ తో పెళ్లి ఎవరు చేశారు.. తర్వాత ఏమైంది.. అనే విషయాలు ఆ అమ్మాయి మాటల్లోనే తెలుసుకుందాం పదండి..

“నా పేరు తస్లీమ్. మాది హసన్ నగర్. నాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే దుబాయ్ షేక్ తో నాకు వివాహం జరిపించారు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నా. మాది చాలా నిరుపేద కుటుంబం. మా అమ్మ ఇళ్లలో పని చేసేంది. ఆమే మమ్మల్ని పోషించేది. మా నాన్న తాగుడుకు బానిస. తను సంపాదించిందంతా తాగుడుకే తగలేస్తాడు. దీంతో మా ఇల్లు గడవాలంటే అమ్మ ఇళ్లలో పని చేయాల్సిందే.

మీ అమ్మాయికి పెళ్లి చేయండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి.. అని మా ఇంటి పక్కనుండే ఆంటీ.. మా అమ్మకు సలహా ఇచ్చింది. వాళ్లు చాలా డబ్బులిస్తారని.. ఇల్లు కూడా ఇస్తారని ఆశ పెట్టింది. దీంతో మా అమ్మ కూడా సరేనంది. తర్వాత నన్ను ఓ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ దుబాయ్ షేక్ ఉన్నాడు. నన్ను గదిలోకి పంపించారు.

ఆ గదిలో అప్పటికే ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. అందరం వరుసలో నిలబడ్డాం. షేక్ ఒక్కొక్కరి చూసి.. చివరకు నన్ను ఎంపిక చేసుకున్నాడు. ఎంత వరకు చదివావు అని అడిగాడు. ఒకసారి నడవమన్నాడు. ఆ తర్వాత మరోసారి నన్ను గదిలోకి పంపించారు.

షేక్ వయసు మా నాన్న కంటే ఎక్కువ ఉంటుంది. ఇంచుమించు మా తాత వయసు ఉంటుంది. అతడిని చూసిన అమ్మ కూడా అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావు.. అని అడిగింది. వద్దులే.. ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం.. అని చెప్పింది.

కానీ.. నన్ను తీసుకొచ్చిన ఆంటీ… మాకు భరోసా ఇచ్చింది. నిన్ను షేక్ మంచిగా చూసుకుంటాడు. ఎటువంటి సమస్యా ఉండదని చెప్పింది. షేక్ ఎటువంటి సమస్యలు లేకుండా మా అమ్మకు కూడా డబ్బులు ఇస్తాడు.. అని చెప్పేసరికి నేను అతడిని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పా.

అంతే… వెంటనే అక్కడే మా పెళ్లి చేశారు. తెల్ల కాగితాలపై మా అమ్మ సంతకం, నా సంతకం తీసుకున్నారు. మీ కూతురు పెళ్లయిపోయింది. ఇదిగో డబ్బు అని అమ్మకు 80 వేలు ఇచ్చారు. అందులో 40 వేలు మమ్మల్ని తీసుకొచ్చిన ఆంటీ తీసుకుంది. దుబాయ్ షేక్ నన్ను తనతో పాటు తీసుకెళ్లేందుకు పాస్ పోర్ట్ కోసం అప్లయి చేస్తా అని చెప్పి… మా అమ్మ నుంచి మరో 10 వేలు తీసుకుంది. దీంతో మా అమ్మ దగ్గర మిగిలింది 30 వేలు.

ఏదో మోసం జరుగుతోందని నేను గ్రహించా. వీళ్లు నన్ను వాడుకొని వదిలేస్తారని నాకు అర్థమయింది. దీంతో నేను వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకు సమాచారం అందించా. దుబాయ్ షేక్ ను పోలీసులకు పట్టించా. అయితే.. పోలీసులు మా అమ్మను కూడా కేసులో ఇరికించారు. కూతురుకు బలవంతంగా బాల్య వివాహం చేశావని అరెస్ట్ చేశారు. అమ్మను కూడా జైలులో పెట్టారు.

ఆ తర్వాత నాకు ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉండగా.. ఇలా షేక్ ల బారిన పడిన అమ్మాయిలను షహీన్ ఫౌండేషన్ ఆదుకుంటోందని తెలిసింది. ఆ ఫౌండేషన్ నిర్వాహకురాలిని కలిశా. తనే నాకు ధైర్యం చెప్పింది. అక్కడే నన్ను ఉంచుకున్నారు. పదో తరగతిలో అడ్మిషన్ ఇప్పించారు. అలా ఇంటర్ పూర్తి చేసి.. ప్రస్తుతం డిగ్రీ చదువు కోసం ప్రయత్నిస్తున్నా. ఇంటర్ చదువుతూనే డీమార్ట్ లో పనిచేసేదాన్ని. నెలకు 10 వేలు సంపాదించేదాన్ని. నా కాళ్ల మీద నేను నిలబడగలిగాను అంటే అది కేవలం షహీన్ ఫౌండేషన్ వల్లే. వాళ్లే నన్ను ఆదుకొని జీవితం చూపించారు. లేకపోతే నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని ఉండేదాన్ని. ఇక.. నాకు ఉన్న లక్ష్యం అంటూ ఒకటే… ఐపీఎస్ కావడం. దాని కోసమే నేను కష్టపడుతున్నా.. అంటూ కన్నీటి పర్యంతమైంది తస్లీమ్.

Read more RELATED
Recommended to you

Latest news