ఆర్టీసీ బస్సుల్లో బాగా రద్దీ ఉంటే.. మహిళలకే వారికి కేటాయించిన సీట్లు వారికి దక్కవు. ఇక వృద్ధులు, వికలాంగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. బస్సు కండక్టర్లు కొందరు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటారు. దీంతో మహిళలు, వృద్ధులు, వికలాంగులు తమకు సీట్లు ఉన్నప్పటికీ వాటిల్లో ఉన్నవారిని లేపి కూర్చునే సాహసం చేయరు. ఫలితంగా గమ్యస్థానం చేరుకునే వరకు నిలబడే బస్సుల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఓ వృద్ధుడు కూడా ఇలాగే బస్సులో నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. తనకు న్యాయం చేయాలంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. దీంతో ఫోరం బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆర్టీసీకి రూ.6వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే…
సంగారెడ్డిలోని శాంతినగర్‌కు చెందిన సీనియర్ సిటిజెన్ నాగేందర్ 2017, జూన్ 18వ తేదీన ఉదయం పని నిమిత్తం రామాయం పేట నుంచి వెళ్లే క్రమంలో మెదక్ డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. అయితే బస్సు చాలా రద్దీగా ఉంది. దీంతో ఆయన సీనియర్ సిటిజన్ అయినందున బస్సులో ముందు ఉండే సీటులో కూర్చునేందుకు ముందుకు వెళ్లాడు. కానీ సీనియర్ సిటిజెన్ సీటులో యువకులు కూర్చున్నారు. దీంతో అదే బస్సులో ఉన్న కండక్టర్‌ను ఆ విషయం అడిగాడు. సీనియర్ సిటిజెన్ సీటులో కూర్చున్న యువకులను లేని తనకు ఆ సీటు కేటాయించాలని కోరాడు. అయితే కండక్టర్ పట్టించుకోలేదు. దీంతో నాగేందర్ తన గమ్యస్థానం చేరే వరకు బస్సులో నిలబడే ప్రయాణించాల్సి వచ్చింది.
అయితే నాగేందర్ వృత్తి రీత్యా న్యాయవాది అయినందున ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదల్లేదు. ఆయన మెదక్ డిపో మేనేజర్‌కు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. అయితే అక్కడా ఆయనకు నిరాశే ఎదురైంది. డిపో మేనేజర్ కూడా ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో చివరకు నాగేందర్ జిల్లా వినియోగదారుల ఫోరంలో కంప్లెయింట్ ఇచ్చాడు. దీంతో కేసు పూర్వాపరాలు విచారించిన ఫోరం బాధితుడు నాగేందర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. బస్సులో సీనియర్ సిటిజెన్‌కు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వాలని, ఆ బాధ్యత కండక్టర్లదేనని ఫోరం స్పష్టం చేసింది. ఈ క్రమంలో నాగేందర్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను కండక్టర్, డిపో మేనేజర్‌లను ఫోరం మందలించింది. అంతేకాదు, ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెబుతూ ఆర్టీసీకి రూ.5వేలతోపాటు బాధితుడి ఖర్చుల నిమిత్తం మరొక రూ.1వేయి కలిపి మొత్తం రూ.6వేలను నాగేందర్ కు చెల్లించాలని ఫోరం తీర్పునిచ్చింది. అలా ఫోరం ఆర్టీసీకి జరిమానా వేసింది..! ఈ క్రమంలో ఫోరం తీర్పుపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.