జగన్‌తో యార్లగడ్డ భేటీ.. లోటస్‌పాండ్‌లో ఏం జరుగుతోంది..?
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి నేతలు క్యూ కడుతున్నారు. ఆ పార్టీ అధినేత జగన్ లండన్ పర్యటనకు ముందు కొందరు నేతలు వైకాపాలో చేరారు. అయితే జగన్ లండన్ నుంచి వచ్చాక కూడా ఆ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస రావు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే తాజాగా ఏపీ హిందీ అకాడమీ చైర్మన్, ప్రముఖ సాహితీ వేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జగన్‌ను కలిశారు. దీంతో ఇప్పుడీ విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
వైకాపా అధినేత జగన్ సమక్షంలో లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసంలో ఇప్పటికే పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డితో కలిసి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా జగన్‌ను కలిసి సమావేశమయ్యారు. కాగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత స్వర్గీయ ఎన్టీఆర్‌కు యార్లగడ్డ అత్యంత సన్నిహితుడు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా గతంలో సేవలందించారు. అయితే ఇప్పుడు యార్లగడ్డ జగన్‌ను కలవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తోంది.
అయితే యార్లగడ్డ మాత్రం… సినారేపై తాను రాసిన పుస్తకాన్ని అందజేయడానికే జగన్‌ను కలిశానని చెబుతున్నారు. జగన్‌తో సమావేశం అయిన మాట నిజమే అయినా.. ఆయనతో రాజకీయాలపై చర్చలు జరపలేదని యార్లగడ్డ అన్నారు. అయితే గత కొద్ది రోజుల కింద జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస రావు కూడా జగన్‌ను కలిసి ఇదే తరహా వ్యాఖ్యాలు చేశారు. కానీ ఆయన నేడు వైసీపీలో చేరారు. ఈ క్రమంలో యార్లగడ్డ కూడా త్వరలో వైసీపీ చేరుతారనే వార్తలు జోరందుకున్నాయి. అయితే ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు..!