‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవ’ని తన ఇంటి గోడపై రాయించాడో వ్యక్తి..! ఎక్కడో తెలుసా..?

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దీంతోపాటు ఆయన తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే 105 మంది అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించారు. ఇక టీఆర్‌ఎస్ దూకుడుకు ఏమాత్రం తీసిపోలేదు అన్నట్లుగా అటు విపక్షాలు కూడా ఎన్నికల హీట్‌ను రోజు రోజుకీ పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే 60 మంది అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. ఇక నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల్లో మునిగి పోయారు. నోట్లతో, ఇతర వస్తువులతో వారు ప్రజలకు గాలం వేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ప్రజల ఓట్లను డబ్బుతో కొనాలని చూసే నేతలకు దిమ్మ తిరిగేలా ఓ వ్యక్తి తన ఇంటి గోడపై రాయించిన వాక్యాలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథ్ పల్లి మండలం, కోమళ్ల గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటస్వామి అనే వ్యక్తి తన ఇంటి గోడపై పై విధంగా వాక్యాలు రాయించాడు. తమ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఓట్లు అమ్మబడవని రాశాడు. అంతేకాదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువనిచ్చి ప్రతి ఒక్కరు ఓటును తమ ఆయుధంగా చేసుకుని తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని, నోట్ల కోసం ఓట్లను అమ్ముకుని బానిసలు కావద్దని కూడా వెంకటస్వామి రాయించాడు.

వెంకటస్వామి ఇలా రాయించిన వాక్యాలను ఎవరో ఫొటో తీసి నెట్‌లో పెట్టగా ఇప్పుడా ఫొటో వైరల్ అయింది. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తూ అతను రాయించిన రాతలు అందరిలోనూ ఓట్ల పట్ల స్పృహను మేలుకొలుపుతున్నాయి. నోట్ల కోసం ఓట్లను అమ్ముకోకూడదని, విలువైన ఓటుతో తమకు కావల్సిన నేతలనే ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవాలని అతను సూచించిన తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news