రాబోయే నాలుగు నెలల్లో 32లక్షల పెళ్ళిళ్లు.. రూ.3.75 లక్షల కోట్ల ఖర్చు

-

ఇండియాలో పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది.. ఇన్నాళ్లు కొన్ని కారణాలు వల్ల ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.. కానీ రాబోయే నాలుగు నెలల్లో ఏకంగా 32 లక్షల పెళ్ళిళ్లు జరుగుతాయనేది ప్రాథమిక అంచనా..! గతంలో కరోనా వైరస్ ప్రభావం, ముహూర్తాలు లేకపోవడం వల్ల వాయిదా పడ్డ పెళ్లిళ్లు త్వరలో జరగబోతున్నాయి. నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు 32 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని మార్కెట్ నిపుణుల వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారతదేశంలో వెడ్డింగ్ మార్కెట్ విలువ 50 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.4 లక్షల కోట్ల పైనే ఉంటుంది… కరోనా వైరస్ మహమ్మారి తర్వాత తొలిసారి ఇప్పుడే భారీ సంఖ్యలో ఇన్ని పెళ్లిళ్లు జరగబోతున్నాయి.. గతేడాది ఇదే సీజన్‌లో 2.5 మిలియన్లు అంటే 25 లక్షల పెళ్లిళ్లు జరిగితే, ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా 32 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి.
గతేడాది జరిగిన పెళ్లిళ్లలో రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఈ సీజన్‌లో సుమారు రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు జరగనుందని అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో 100 శాతం వృద్ధి కనిపిస్తుందని, అన్ని సెగ్మెంట్లలో రికవరీ బాగా కనిపిస్తుందని ఫెర్న్స్ అండ్ పెటల్స్ వెన్యూస్ అండ్ వెడ్డింగ్స్ ఫౌండర్ అండ్ ఎండీ వికాస్ గుట్‌గుటియా CNBC-TV18 తో తెలిపారు
పెళ్లిళ్ల సీజన్ తిరిగి ప్రారంభం కావడమే కాదు, సందడి కూడా పెరిగిందని, ఇది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే రంగం అని, మహమ్మారి ముందు కన్నా ఈ పెళ్లిళ్ల సీజన్ పెద్దగా ఉంటుందని భావిస్తున్నాట్లు.. వికాస్ గుట్‌గుటియా అన్నారు. ఈసారి ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ఆయన వివరించారు.
మహమ్మారి తర్వాత, పెళ్లిళ్లకు ఆహ్వానించే అతిథుల సంఖ్య తగ్గింది.. ఫంక్షన్‌లకు రావాల్సిన వారిని సెలెక్ట్ చేయడంలో అందరు జాగ్రత్తగా ఉంటున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ అంటేనే పూలకు గిరాకీ ఎక్కువ. ప్రతీ ఏటా పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం ఉపయోగించే పువ్వులు మూడింట రెండు వంతులు ఉంటాయి. ధనవంతులు వెడ్డింగ్ ప్లానింగ్ వైపు వెళ్తుంటే, మధ్య తరగతి ప్రజలు మాత్రం సంప్రదాయ పద్ధతిలో పెళ్లిళ్లు చేస్తున్నారు. నెంబర్స్ చూస్తే మొత్తం పెళ్లిళ్లలో 10 శాతం పెళ్లిళ్లను ప్రొఫెషనల్స్ నిర్వహిస్తున్నారని, మిగతా పెళ్లిళ్లన్నీ అసంఘటితంగానే ఉన్నాయని ఈ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు.
ఎక్కువ పెళ్లిళ్లు రూ.50 లక్షల లోపే జరుగుతున్నాయని, ఆ తర్వాతి స్థానంలో రూ.50 లక్షల-రూ.2 కోట్ల మధ్య జరిగే పెళ్లిళ్లు ఉన్నాయని, ఆ తర్వాత రూ.2 కోట్లు-రూ.10 కోట్ల పెళ్లిళ్లు ఉన్నాయని వికాస్ తెలిపారు. ఏది ఏమైనా.. ఆ 32లక్షల పెళ్లిళ్లో మీ పెళ్లి కూడా ఉంటుందేమో.!!

Read more RELATED
Recommended to you

Latest news