చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే చెన్నైకి చెందిన ఆనంద్ దీపావళి వేళ పేదల కళ్లలో ఆనందం నింపేందుకు అద్భుత ఆఫర్ ప్రవేశపెట్టాడు. చాకలిపేటలో తాను నిర్వహిస్తున్న వస్త్రదుకాణంలో ఈ నెల 19 నుంచి 26 వరకు రోజూ ఓ గంటపాటు ప్రత్యేక ఆఫర్‌తో దుస్తులు విక్రయించాడు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కేవలం రూపాయికే చొక్కా, పది రూపాయలకే నైటీ విక్రయించనున్నట్టు ప్రకటించడంతో జనం అతడి దుకాణానికి క్యూకట్టారు.
అయితే వాస్తవానికి రోజుకు 50 మందికి మాత్రమే విక్రయించాలనుకున్నా.. పేదలు పోటెత్తడంతో ఆ సంఖ్యను 200గా మార్చాడు. వారం రోజులపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంచిన ఆనంద్.. వేలాదిమందికి ఇలా రూపాయికే దుస్తులు విక్రయించి వారి కళ్లలో ఆనందం నింపాడు. ఆనంద్ మాట్లాడుతూ.. ఏదైనా ఓ వస్తువును ఉచితంగా అందిస్తే దానికి విలువ ఉండదని, అందుకనే ఇలా రూపాయి, పది రూపాయల ధర నిర్ణయించి విక్రయించినట్టు చెప్పాడు.