కలిసొచ్చిన కరోనా..తీహార్ జైలు నుంచి 2000 మంది నేరస్థులు జంప్..!

-

కరోనా వల్ల ఎంతోమంది ఆర్థికంగా నలిగిపోయారు. అయినోళ్లను పోగొట్టుకుని మానసికంగా కుంగిపోయారు. కానీ వారికి మాత్రం కరోనా కలిసొచ్చింది. ఎలా అంటారా.. కరోనా మహమ్మారి రాకతో ఢిల్లీలోని తీహార్ జైలు కూడా పెద్ద నష్టాన్ని చవిచూసింది. కరోనా కాలాన్ని సద్వినియోగం చేసుకుని తీహార్ జైలు నుంచి రెండు వేల మందికి పైగా ఖైదీలు తప్పించుకున్నారు.
గత ఏడాదిన్నరగా పరారీలో ఉన్న ఈ ఖైదీలు లొంగిపోవడానికి గడువు కూడా ముగిసింది. ప్రస్తుతం ఈ ఖైదీల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సీనియర్ జైలు అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. 2020 సంవత్సరంలో కరోనా ప్రారంభమైన తర్వాత కోర్టు ఆదేశం మేరకు 5500 మందికి పైగా అండర్ ట్రయల్ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేశారు.
1100 మందికి పైగా శిక్ష పడిన ఖైదీలకు అత్యవసర పెరోల్ ఇచ్చారు. ఈ ఖైదీలందరూ ఫిబ్రవరి, మార్చి 2021 నాటికి తిరిగి తీహార్ జైలుకు లొంగిపోవాల్సి ఉంది. అయితే వీరిలో దాదాపు 2 వేల మంది ఇప్పటికీ రాలేదు. ఈ ఖైదీలకు సంబంధించి ఢిల్లీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో లిఖితపూర్వకంగా సమాచారం అందించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఖైదీలను తిరిగి జైలులో ఉంచడానికి తప్పించుకున్న ఖైదీల సమాచారాన్ని కూడా పంచుకున్నారు. కరోనా సమయంలో ఖైదీల భద్రత, సామాజిక దూరాన్ని దృష్టిలో ఉంచుకుని, బెయిల్, పెరోల్‌పై అండర్ ట్రయల్‌లతో సహా కొంతమంది శిక్షార్హులను విడుదల చేయాలని ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.
తప్పించుకున్న వారిలో ఇంతవరకూ ఎంతమంది దొరికారు అనే లెక్కలు కూడా లేవు. వాళ్లు మళ్లీ కచ్చితంగా దొరుకుతారు అని కూడా అధికారులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. వారిలో కరుడు గట్టిన నేరస్థులు ఉంటే.. తిరిగి వారు ఎలాంటి ఘోరాలకు పాల్పడతారో చెప్పలేం. ఇప్పటికే మంకీపాక్స్‌ వల్ల ఢిల్లీలో హై ఎలర్ట్‌ ప్రకటించారు. ఇదే అదునుగా నేరస్థులు ఎలాంటి అఘ్యాయిత్యాలకు పాల్పడతారో చెప్పలేం. సాధారణం కేసుల్లో అరెస్ట్‌ అయి జైలు శిక్ష పడిన వారైతే పెద్దగా నష్టం ఉండదు. తప్పించుకుని సాదాసీదా జీవితం గడిపేస్తారు.. తీవ్రమైన నేరాలు చేసే వారితోనే ఇప్పుడు సమస్య.. ఏది ఏమైనా కరోనా కాలం వారికి కలిసొచ్చిందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news