ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇకపై భారీ జరిమానాలు..! రూ.10వేల నుంచి రూ.1లక్ష వరకు ఫైన్..!

-

కేంద్ర ప్రభుత్వం త్వరలో నూతన మోటార్ వాహన చట్టాన్ని అమలులోకి తేనుంది. నూతన మోటారు వాహన చట్టం ప్రకారం.. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ ఎత్తున జరిమానాలు విధించనున్నారు.

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను.. సినిమా గుర్తుంది కదా.. అందులో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు గాను వాహనదారులకు భారీ ఎత్తున జరిమానాలు విధిస్తారు. రూ.10వేలు మొదలుకొని రూ.50వేలు, రూ.1 లక్ష వరకు ఫైన్ వేస్తారు. అయితే అది సినిమాయే కదా.. నిజ జీవితంలో అలా జరిగే చాన్స్ లేదని మాత్రం అనుకోకండి. ఎందుకంటే సరిగ్గా అలాంటి భారీ మొత్తాలనే త్వరలో ఫైన్లుగా విధించనున్నారు. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే.

కేంద్ర ప్రభుత్వం త్వరలో నూతన మోటార్ వాహన చట్టాన్ని అమలులోకి తేనుంది. గతంలోనే ఈ చట్టాన్ని అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం యత్నించింది. కానీ అప్పటికే ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం ఆ చట్టం కచ్చితంగా అమలులోకి రానుంది. త్వరలో ఈ చట్టానికి చెందిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయనున్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే మోదీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

నూతన మోటారు వాహన చట్టం ప్రకారం.. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ ఎత్తున జరిమానాలు విధించనున్నారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

* నూతన మోటారు వాహన చట్టం అమలులోకి వస్తే ఓవర్ స్పీడింగ్‌కు రూ.2వేల వరకు జరిమానా వేస్తారు.
* ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2వేల ఫైన్ ఉంటుంది.
* హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1వేయి ఫైన్, 3 నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు.
* వాహన యజమానులు తమ వాహనాలను ఇతరులకు ఇచ్చిన పక్షంలో వారు ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తే వాహన యజమానులకు రూ.25వేల భారీ జరిమానా విధిస్తారు. అలాగే 3 ఏళ్ల జైలు శిక్ష వేస్తారు. వాహనం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. చిన్న పిల్లలకు వాహనాలను ఇచ్చే తండ్రులకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది.
* ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తే ప్రస్తుతం రూ.100 ఫైన్ వేస్తున్నారు. కానీ ఇకపై అది రూ.500 కానుంది.
* ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపితే రూ.500కు బదులుగా రూ.2వేల ఫైన్ వేస్తారు.
* డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5వేల ఫైన్ పడుతుంది. డ్రైవింగ్ చేసేందుకు అనర్హులైన వారు వాహనం నడిపితే రూ.10వేల వరకు జరిమానా వేస్తారు.
* ప్రమాదకరంగా వాహనాలను నడిపితే రూ.5వేల ఫైన్ వేస్తారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు.
* పదే పదే ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ వాహనాలను నడిపే వారిపై రూ.1లక్ష వరకు ఫైన్ వేస్తారు.
* వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణిస్తే రూ.20వేల ఫైన్ పడుతుంది.
* సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రూ.1వేయి ఫైన్ వేస్తారు.
* ఆంబులెన్స్, ఫైరింజన్ వంటి ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10వేల జరిమానా విధిస్తారు.

ఈ రూల్స్‌తో కూడిన నూతన మోటారు వాహన చట్టాన్ని అతి త్వరలోనే అమలులోకి తేనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ర్టాలు కూడా ఈ బిల్లుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఇక ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడమే తరువాయి.. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించే వారి వీపు జరిమానాలతో విమానం మోత మోగనుంది..!

Read more RELATED
Recommended to you

Latest news