కొంత మంది వ్యక్తులు వీఐపీలు అనగానే వారికి అతి మర్యాదలు చేస్తుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఘటన ఆ కోవకు చెందినదే. వీఐపీ సేవలో సామాన్యుడి బండిని ధ్వంసం చేశాడు ఓ ట్రాఫిక్ పోలీసు. ఇంతకీ ఆయన ఎందుకు అలా చేశాడు? అసలు ఏం జరిగిందంటే..
తమిళనాడులోని చెన్నై సిటీ మెరీనా బీచ్‌లో ఈ ఘటన జరిగింది. మెరీనా బీచ్ రోడ్ లో వీఐపీ కాన్వాయ్ రాబోతున్నదని సమాచారం పోలీసులకు వచ్చింది. దాంతో వెంటనే ఓ ట్రాఫిక్ పోలీసు నాన్ పార్కింగ్ ఏరియాలో బైక్ పార్కు చేసి ఉండటాన్ని చూశాడు. అంతే ఇక ఓవర్ యాక్షన్ షురూ చేశాడు. నిబంధనల ప్రకారం అయితే జరిమానా వేయాలి లేదా బండిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలి. కానీ, సదరు ట్రాఫిక్ పోలీస్ అలా చేయలేదు. తన చేతిలో ఉన్న లాఠీతో బైక్‌ను పగులగొట్టాడు. బాగా గట్టిగా బైక్‌ను కొట్టాడు. బైక్ గ్లాసెస్ పగిలిపోవడంతో పాటు ముందు భాగం మొత్తం ధ్వంసమయింది. ఇలా ట్రాఫిక్ కానిస్టేబుల్ చేస్తుండటాన్ని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలా ఈ వీడియో కాస్తా వైరల్ అయింది. ఓ కాలేజీ విద్యార్థి బైక్‌ను ఇలా చేయడానికి ట్రాఫిక్ పోలీసుకు ఏం హక్కుంది? అనే ప్రశ్నల నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ఈ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరింది. వారు ఈ వీడియో చూసి స్పందించారు. ఓవర్ యాక్షన్ చేసిన ట్రాఫిక్ పోలీసు మోహన్ అని గుర్తించారు. ఈ విషయమై విచారణ చేపట్టారు. రిపోర్టు రాగనే అతడిపై యాక్షన్ తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.