‘సర్దుకున్నారా..!’ (కదిలించిన కథ)

-

వాతావరణం బాగుంది. ఇంకా సూర్యుడు నిండుగా రాలేదు. కానీ చలిగా కూడా లేదు. చలిలో తిరిగితే నాకు ఆయాసం వస్తుంది. అందుకే నాకు తెల్లవారుజామునే మెలుకువ వచ్చినా, ఏడింటికి వరకు ఇంటి బయటకు రాను. చలి తగ్గగానే, మా అపార్ట్ మెంటు బిల్డింగ్ గేటు దాటి ఇందిరా పార్కు వైపు నడక సాగించాను.

చిన్నప్పుడు పార్కులో ఎక్కువ సేపు ఆడుకుంటే మా నాన్న తన్నేవాడు. ఇప్పుడేమో, ‘ఎప్పుడూ ఇంట్లో కూర్చోకండి. పొద్దున్నపూట తప్పనిసరిగా నాలుగు కిలోమీటర్లు నడవండి. మధ్యాహ్నం, రాత్రి భోజనం తిన్న తర్వాత కూడా వెంటనే పడుకోకుండా కాసేపు బయట తిరిగితే మంచిది’ అని డాక్టర్లు చెప్పడంతో, ఉదయం, రాత్రి నడక అలవాటు చేసుకున్నాను.

ఇందిరా పార్కులో కొన్ని రోజుల్లోనే మాకొక గ్రూపు తయారయింది. అందరం రిటైరైనవాళ్ళమే. వాళ్ళందరినీ కలిస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తాము. ఉదయం పూట ఇందిరా పార్కు మహా సంరంభంగా ఉంటుంది. ఏదో పెళ్ళికో, పండగరోజున గుడికి వచ్చినట్టుగానో వేలాది మంది హడావుడిగా నడుస్తుంటారు.

ఇందిరా పార్కు ఉదయం పూట ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్టులా ఉంటుంది. పళ్ళూ, కూరగాయలూ, రకరకాల సూప్స్, బట్టలూ అమ్మే సమస్త దుకాణాలు ఉంటాయి. కానీ, పదింటికల్లా నిర్మానుష్యమై పోతుంది.

మా గ్రూపులో నాతో పాటు రెడ్డి, రాజారావు, పద్మనాభం, శేషగిరి, రామ్మూర్తి మెంబర్లు ఉన్నారు. ఒక్కోరోజు మా గ్రూపులో ఉన్న మితృలకు తెలిసిన మితృలు కూడా కలుస్తుంటారు.

మేము చివరగా పార్కు మధ్యలో ఉన్న వినాయకుడికి దండం పెట్టుకుని నడక ముగించి, ముఖద్వారం దగ్గరున్న మెట్ల మీదనో, బెంచీ మీదనో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటుంటాము.

మా మాటల్లో ఎక్కువగా రాజకీయాలు, మేము చేసిన ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు దొర్లుతుంటాయి. ఎప్పుడైనా ఆరోగ్యం గురించిన ప్రస్తావన వస్తే, అందరి మనసులూ భారమౌతాయి.

మా గ్రూపులో డెభ్భై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇద్దరున్నారు. ఆరోగ్యం గురించి మాట్లాడగానే, అందరి దృష్టి వాళ్ళ మీదనే పడుతుంది. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఈ వయసులో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేము. ఆ భయం మా అందరిలోనూ అంతర్లీనంగా ఉంది.

ఒక్కొక్కరోజు నడక ముగిసిన తర్వాత విడిపోతుంటే, మా ఆరేడుగురిలో మరునాడు ఏ ఒక్కరైనా మిస్ అవుతారేమోనని; మరునాడు పేపర్లో ‘నిర్యాణం’ కాలంలో ఫోటో వస్తుందేమోనని లేదా ఏ వారం రోజులకో, ‘దశదిన కర్మ’ కార్డు వారి మరణ సందేశం మోసుకొస్తుందేమోనన్న ఒక అదృశ్యపు సందేహపు మొలక మా మనసు పొరల్లో ప్రతీరోజూ ప్రాణం పోసుకుంటూనే ఉంటుంది.

మా మధ్య కుటుంబ స్నేహాలు లేవు కాబట్టి మా పరిచయాలు నడక వరకు మాత్రమే పరిమితం. తరువాత ఎవరి జీవితాల గురించి, ఎవరికీ తెలియదు కాబట్టి ఒక్కోసారి మరణ వార్త తెలియదు కూడా.

ఇంతలో రమణ అనే మితృడు మా గ్రూపులోకి వచ్చి చేరాడు. ఒక జాతీయ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజరుగా ఈ మధ్యనే రిటైరయ్యాడు.

రమణ రాకతో మా గ్రూపు రూపురేఖలే మారిపోయాయి. రమణ మాటల పుట్ట. ఎన్నో విషయాల గురించి అనర్ఘళంగా మాట్లాడేవాడు. అప్పటివరకు పైపైన, పలుచగా ఉన్న మా స్నేహం అతని రాకతో చిక్కబడింది, గాఢంగా మారింది.

అసలు ఆయన చెబితేనే గానీ ఆయన రిటైరయ్యాడని నమ్మలేం. స్లిమ్ గా, లేటెస్ట్ మాడల్ రీబాక్ షూ, కళ్ళకు గాగుల్స్, ఒంటి మీద నుండి తేలుతూ వచ్చే కమ్మనైన సెంటు మధురిమలతో కులాసాగా ఉంటాడు. ప్రతీరోజూ తన ఇన్నోవా క్రిస్టా కారులో పార్కుకు వస్తాడు.

రమణ వచ్చిన తర్వాత నడక పూర్తి కాగానే మమ్మల్ని తన కారులో ఎక్కించుకుని రోజుకో హోటలుకు తీసికెళ్ళి కాఫీ, టిఫిన్లు ఇప్పించేవాడు.

పరిచయమైన మొదటి రోజు సాయంత్రమే పళ్ళబుట్ట పట్టుకుని మా ఇంటికి వచ్చాడు. మా ఆవిడతో ‘అక్కయ్యా’ అని వరస కలిపి క్లోజ్ అయిపోయాడు. మా కోడలితో ముచ్చట్లు పెట్టాడు. ఆరునెలల వయసున్న మా మనుమణ్ణి ఎత్తుకుని వాడి చేతిలో ఐదువందల నోటు పెట్టాడు.

‘బయటకు వెళ్దాం పదమని’ నన్ను బలవంత పెట్టాడు. కారు తిన్నగా క్రిస్టల్ బారు ముందు ఆపాడు. రమణని చూడగానే, గుమ్మంలో ఉన్న ‘వాలె’ పార్కింగ్ బాయ్ నుంచి లోపల స్టీవార్డ్ వరకూ ఆప్యాయంగా విష్ చేయడం చూసి నేను విస్తుపోయాను.

నేను మొహమాటపడుతుంటే,

“ఫర్వాలేదు సార్! రెండు పెగ్గుల విస్కీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. హెచ్డీయల్ కొలెస్టరాల్ పెరుగుతుంది. గుండె గట్టి పడుతుంది!” అంటూ బుజ్జగించి మందు పోయించాడు. రెండు పెగ్గులు కాగానే ముగించాడు. అందరికీ భారీగా టిప్పులు ఇచ్చాడు.

రమణ కారు దిగగానే, రోజూ ‘వాలే’ బాయ్, రమణ డ్రైవరుకు ఫోన్ చేస్తాడంట. అందుకే మందు తాగి బయటకు రాగానే, కారు దగ్గర నిలబడిన డ్రైవరుకు, రమణ మా ఇంటి అడ్రస్ చెప్పాడు. నన్ను ఇంటి దగ్గర దించి, ‘గుడ్ నైట్’ అని చెప్పి వెళ్ళిపోయాడు.

చాలా రోజుల తర్వాత నాకు ఆ సాయంత్రం సంతోషంగా గడిచినట్టనిపించింది. హాయిగా నిద్రపోయాను. కలలో రమణ ముఖమే కనిపించింది.

మరునాడు, అందరం కలుసుకున్నాం. రమణతో గడిపిన సాయంత్రం గురించి చెప్పుకున్నాము. రమణ మా వాకర్స్ గ్రూపులోని అందరి ఇళ్ళకు వెళ్ళాడు. నన్ను తోడు రమ్మంటే నేను కూడా వెళ్ళాను. ఎవ్వరింటికి వెళ్ళినా అక్కడ నవ్వుల పువ్వులు పూయించేవాడు.

అలా ఒక నెలరోజుల్లో రమణ మా అందరి ఇళ్ళకు వచ్చాడు. అందరిని పిలిచి వాళ్ళ ఫార్మ్ హౌజులో వన భోజనాలు ఏర్పాటు చేసాడు.

డిసెంబర్ నెలలో తన కారులోనే గోవా ట్రిప్ ప్లాన్ చేసాడు. మేమందరం వెళ్ళడానికి సిద్ధమే అయినా, అంత ఖర్చు అతనితో పెట్టించడం బాగుండదని తలా కొంత కంట్రిబ్యూట్ చేస్తామని చెప్పాము.

“ఏం ఫర్వాలేదు సార్! డబ్బుల విషయాలన్నీ గోవా నుండి వచ్చాక చూసుకుందాం!” అని అన్ని ఖర్చులు తనే పెట్టుకున్నాడు. గోవాలో మా కోసం ఒక పెద్ద బంగళా రిజర్వ్ చేసాడు. డిసెంబర్ నెలలో గోవాలో అంతా పండగ వాతావరణం ఉంది. పడుచు జంటల కోలాహలంతో, ఒక సీతాకోకచిలుకల వనంలా ఉంది.

మేమంతా కొంచెం మొహమాట పడుతుంటే, రమణే

“సార్! మనం ఉద్యోగం నుండి మాత్రమే రిటైరయ్యాము. జీవితాల నుండి కాదు. అందరూ ‘శేషజీవితం’ అంటూ మనకు వీడ్కోలు పలుకుతూ అంటారు. కానీ… నిజంగా మనది శేష జీవితం కాదు. బరువులు, బాధ్యతలు లేని చిన్న పిల్లవాడి లాంటి ‘విశేషజీవితం’ మనది. మనముందు ఇంకా చాలా జీవితం ఉంది. అందుకే, మరణించేవరకు జీవించాలి,
హాయిగా గడపాలి !” అని మమ్మల్ని ఉత్సాహపరిచాడు.

దాంతో, అక్కడి యౌవ్వనపు వాతావరణం చూస్తుంటే మాక్కూడా హుషారు పుట్టుకొచ్చింది. మేము రిటైరయిన వృద్ధులమన్న విషయమే మరిచిపోయి, కేరింతలు కొడుతూ బీచుల్లో సరదాగా గడిపాము.

నాలుగు రోజుల తర్వాత హైదరాబాదుకు తిరిగొచ్చాము. నాకైతే, ఈ గోవా ట్రిప్పు బాగా నచ్చింది. శరీరం, మనసూ రిజొవనేట్ అయి, పునరుజ్జీవనం పొందినట్టయింది. అంతకు ముందులాగా నిస్తత్తువగా, నిరాసక్తంగా కాకుండా జీవితం కొత్త అందాలతో కనిపించసాగింది.

రెండు రోజుల విరామం తర్వాత, ఇందిరా పార్కుకు వెళ్ళాను. ఆ రోజు రమణ రాలేదు. బహుశా అలసట తీరలేదేమోననుకుని, ఫోన్ చేసాను.

ఫోన్ లో వాళ్ళబ్బాయి చెప్పిన వార్త విని మ్రాన్పడిపోయాను.

అందరం కలిసి రమణ ఉన్న హాస్పిటలుకు పరుగు పరుగున వెళ్ళాము.

“గోవా నుండి వచ్చిన రోజు తెల్లవారుఝామున తీవ్రమైన గుండె పోటు వచ్చిందనీ, వెంటనే హాస్పిటలుకు తీసుకు వస్తే రెండు స్టెంట్లు వేసారని, ఇప్పుడు బాగానే ఉన్నారని” వాళ్ళబ్బాయి చెప్పాడు.

మేమందరమూ తీవ్ర దుఃఖంతో బయటకు నడిచాము. నేనైతే ప్రతీరోజు హాస్పిటలుకి వెళ్ళి రమణని కలిసేవాణ్ణి. కొంత కోలుకోగానే రమణలో మళ్ళీ అదే హూషారు కనిపించింది.

రెండు నెలల తర్వాత రమణ ఇందిరా పార్కుకు, వాకింగుకు వచ్చాడు. నడక పూర్తయిన తర్వాత, పార్కు బయట టీ తాగుతూ,

“సర్దేసుకున్నాను బాస్!” అన్నాడు నవ్వుతూ. మాకర్థం కాలేదు. మళ్ళీ ఏదైనా ట్రిప్పుకు కు ప్లాన్ చేస్తున్నాడేమోననుకుని,

“ఈ సారి ట్రిప్ ఎక్కడికి?” అని అడిగాను నేను కుతూహలంగా.

రమణ నవ్వుతూ,

“బాస్! ఈ సారి ట్రిప్ అంటూ వేస్తే, అది పైకే! అందుకే అన్నీ సర్దేసుకున్నాను. అన్ని బాకీలు తీర్చేసుకున్నాను. ఈ జీవితం ప్రసాదించిన అందమైన మధురస్మృతులన్నీ మూటకట్టి మనో మంజూషలో దాచుకుని, మిగిలినవన్నీ వొదిలించుకున్నాను. ఆత్మీయులందరినీ కలిసి నా జీవితాన్ని ఇంత అందంగా మలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేసాను. నా వల్ల కష్టం కలిగిన వాళ్ళందరినీ; తెలిసో తెలియకో, ఉద్యోగ ధర్మం మీరలేకో నా వల్ల నష్టం కలిగినవారందరినీ కలిసి సారీ చెప్పాను. మనస్ఫూర్తిగా క్షమాభిక్ష కోరాను. నాకు నష్టం కలిగించినవారిని, నన్ను నమ్మించి మోసం చేసినవారిని కూడా కలిసి, వాళ్ళను కూడా క్షమించేసాను. ఇంకా ఒకరిద్దరిని కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.

అందుకే, మీ అందరికి కూడా థ్యాంక్స్ చెబుదామనే వచ్చాను. గత కొద్ది నెలలు, మీరందరూ నాకు ఆనందాన్ని పంచారు. థ్యాంక్యూ వన్స్ అగైన్!

ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఏ కోరికలు లేవు. ఏ అసంతృప్తి, నిరాశానిస్పృహలు లేవు. ఒక అలౌకిక ఆనందంలో మునిగి తేలుతున్నాను.

ఐయాం రెడీ ఫర్ హిస్ కాల్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కాబట్టి, జీవితాంతం ఆరాటంతో సంపాదించిన వస్తువులనన్నింటినీ వదిలించుకుని నా భౌతిక జీవితాన్ని శుభ్రపరుచుకున్నాను. ద్వేషాన్ని, కోపాన్ని అసంతృప్తిని వీడి ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాను. దీన్నే ‘డెత్ క్లీనింగ్’ (Death Cleaning) అంటారని, ఈ మధ్యనే ఒక వాట్సప్ మెసేజ్ లో చదివాను. నేను డెత్ క్లీనింగ్ చేసుకుని సిద్ధంగా ఉన్నాను. అంత మాత్రాన నేను ఇవ్వాళ్ళో రేపో చనిపోతానని కాదు. కానీ, ఈ గుండె ఉంది చూసారూ… ఎప్పుడేం చేస్తుందో చెప్పలేము.” అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.

+++

అదే చివరిసారిగా రమణని చూడడం. ‘గోవా’ ట్రిప్పు ఖర్చు బాకీ తీర్చే అవకాశమే లేకుండా పోయింది మాకు. మరో జన్మంటూ ఉంటే మమ్మల్ని మళ్ళీ కలపడానికి ఋణశేషం మిగిలే ఉంది.

ఇప్పుడు నేను ఇందిరా పార్కుకు ఎక్కువగా పోవడం లేదు. నేను కూడా ‘డెత్ క్లీనింగ్’ పనిలో ఉన్నాను.

+++

దీపావళి పండగ రోజు గుడికి వెళ్ళే హడావుడిలో ఉండి మా కోడలు,

“అత్తయ్యా! అన్నీ సర్దుకున్నారా?” అని అడగడం వినిపించింది.

ఆ ప్రశ్న వినగానే మా ఆవిడ తన చీరె కొంగుతో కళ్ళొత్తుకోవడం, నేను దూరం నుండి చూస్తూనే ఉన్నాను. ఈ రోజంతా ఉదయం నుండీ తను అలాగే, దిగులుగా, ముఖానికి మబ్బులు కమ్మినట్టుగా ఉంది. దానికి కారణం కూడా నాకు తెలుసు.

నేను ఫోన్ తీసి చూసాను. ఆ మబ్బుల్లో నుంచే మొలిచిన హరివిల్లు ఆమె ముఖంలో విరిసే క్షణం ఇంకెంతో దూరం లేదు. నాకు తెలుసు, ఎందుకంటే……

+++

నేను ఎప్పటిలాగానే, ఇంకా కొంచెం ముందుగానే, మా ఆవిడకు ఇందిరా పార్కకు వాకింగుకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాను. నా చేతిలో ఎప్పుడూ ఉండే చిన్న బ్యాగు తప్ప మరేం లేదు. బయటకు రాగానే, నేను బుక్ చేసిన క్యాబ్ నంబరు సరి చూసుకొని కారులో ఎక్కాను.

ఇందిరా పార్కుకు అని నా భార్యకు చెప్పిన నేను పది గంటలకల్లా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ రెండులో దిగాను. క్యాబ్ బుక్ చేసి, అది వొచ్చేలోగా, రెస్ట్ రూములోకి వెళ్ళి ఫ్రెష్ అయి, బ్యాగులో నుంచి తీసిన టై కట్టుకుని, కోట్ వేసుకుని క్యాబ్ వాడు ఫోన్ చేయగానే వెళ్ళి కారులో కూర్చున్నాను.

నా మనసు చాలా ఉద్విగ్నంగా ఉంది. దాదాపు పదేళ్ళ తర్వాత నేను నా కూతురును చూడడానికి వెళ్తున్నాను. ఈ రోజు సోమవారం. అల్లుడికి ఆఫీసు ఉంటుంది. అమ్మాయి మాత్రం ‘వర్క్ ఫ్రం హోం’ చేస్తుంది. దాని కూతురు, ఎనిమిదేళ్ళ మైత్రేయి ఖాన్, నాలుగేళ్ళ మనుమడు సలీం శాస్త్రి స్కూలుకు వెళ్ళి ఉంటారు.

మా అమ్మాయి చందన మా అభీష్టానికి వ్యతిరేకంగా ఒక ముస్లిం కుర్రాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. మమ్మల్ని అనుమతి అడిగితే మేము నిరాకరించాము. తను వినలేదు. ఒకరోజు ఆఫీసుకు వెళ్ళిన చందన తిరిగి మా ఇంటికి రాలేదు.

ఆ రోజు రాత్రి పదకొండింటికి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తనూ, సలీంఖానూ పెళ్ళి చేసుకున్నామని చెప్పింది. నా భార్య విభ్రాంతికి గురయింది. ముందు ఏడ్చింది. తర్వాత వాళ్ళను ఇంటికి రమ్మని చెప్పింది. నాన్న పిలిస్తే వస్తానంది. నా భార్య నా వైపు దీనంగా చూసింది. నేను పిలవలేదు. తను రాలేదు. పది సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరు పిల్లలు పుట్టారనీ, అతగాడికి ఢిల్లీ సెక్రెటేరియట్లో పెద్ద పదవి వచ్చిందన్న విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.

నేను గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను. కానీ, ఎక్కడ ఒక చక్కని భార్యాభర్తల జంట, ఇద్దరు పిల్లలతో కలిసి నడుస్తున్న దృశ్యం కనపడ్డా గుండెలో కలుక్కుమంటుంది. ఆ రోజు నా చందనను మన్నించి, నేనెందుకు పిలవలేదానన్న ప్రశ్న నన్ను చిత్రవధకు గురిచేస్తుంది.

ఇన్నాళ్ళూ ఈ బాధను, భారాన్నీ గరళ కంఠుడిలా దిగమింగుకుంటూ జీవిస్తున్నాను. నా భార్య, నా భుజం మీద వాలి తనివితీరా ఏడ్చి తన భారాన్ని దించుకుంటుంది. మగవాడినైన నాకా అదృష్టం లేదు.

అయితే, రమణ చివరిసారిగా కలిసి ‘సర్దుకున్నాను బాస్!’ అని చెప్పిన కొన్నాళ్ళకే చనిపోవడంతో నాలో భయం మొదలైంది. నేను కూడా అన్నీ సర్దుకోవాల్సిన ఆవశ్యకత ఆసన్నమైందని గుర్తించాను.

నేను సర్దుకునే సామాను ఢిల్లీలో ఉందని నాకర్థమయ్యింది. వెంటనే, అభిఙ్ఞవర్గాల ద్వారా, అంటే ఎవ్వరికీ చెప్పకూడదని ఒట్టేయించుకుని, మా అబ్బాయి ద్వారా చందన ఇంటి అడ్రస్, ఫోను నెంబర్లు, మిగిలిన వివరాలు సంపాదించాను. వాడే నాకు ఢిల్లీకి టిక్కెట్లు బుక్ చేసాడు. వాడు అక్కతో టచ్ లోనే ఉన్నట్టుంది.

చందనను సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నాను కానీ అక్కడ ఎటువంటి స్వాగతం ఎదురవుతుందోనని కొంచెం గాభరాగానే ఉంది. ఒక వేళ అల్లుడు ఆఫీసుకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాడేమో, ఒకవేళ వాళ్ళు ఇల్లు మారి ఉంటారేమో లేక ఏదైనా ట్రిప్పుకు వెళ్ళి ఉంటారేమోనన్న సవాలక్ష ప్రశ్నలు నన్ను వేధిస్తున్నప్పటికీ, ఏదైతే అదవుతుందని, మనసును నిబ్బర పరుచుకుని, ఢిల్లీ వీధులను చూస్తూ కూర్చున్నాను.

ముప్పావు గంట తరువాత, నేను దిగాల్సిన సమయం ఆసన్నమయింది. అల్లుడు పెద్ద ఆఫీసరేమో కాబోలు, పెద్ద క్వార్టర్ ముందర నిలబడ్డాను. గేటు తీసుకుని లోపలికి వెళ్ళి బెల్ మోగించాను. అది నా గుండెల్లోనే మోగినట్టుగా అనిపించింది.

తలుపు తెరిచిన నా కూతురు నన్ను చూసి ముందు ఒక్క క్షణం గుర్తు పట్టక “కౌన్…?” అని అనబోయిందల్లా నన్ను తేరిపార చూసి,

“నాన్నా…! నాన్నా..! మీరూ..!” అంటూ మాటలు రాక నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను పదేళ్ళ పాటు కనీసం చూసుకోలేని దురదృష్టానికి చింతిస్తూ, దుఃఖిస్తూ నేను నిలబడ్డాను.

ఏడుస్తున్న నన్ను చూసి, నా చందన, కంగారుగా,

“నాన్నా! ఏమైంది నాన్నా!” అంటూ నన్ను కౌగలించుకుంది. నేను ఒక అపురూపమైన ఆత్మీయ ఆలింగనంలో, నోటమాట రాక నిలబడిపోయాను.

ఆ అలికిడికి, లోపలి నుంచి ఎవరో వచ్చారు.

“మేరా బాబూజీ! కాఫీ బనావో!” అని చెప్పి నా చేతులు పట్టుకుని లోపలికి నడిచింది.

ఒక్క క్షణం నిలబడి, నా కూతురిని చూసుకున్నాను. ఇరవయ్యేళ్ల వయస్సులో మమ్మల్ని వదిలిన చందన ఈ పదేళ్ళలో, సంపూర్ణ మహిళగా రూపాంతరం చెందింది. కొంత పెద్దరికం వచ్చినట్టుగా, మరింత అందంగా తయారయింది.
మన పిల్లలు మనకు ఎప్పుడూ అందంగానే, అపురూపంగానే కనిపిస్తారు కదా!

“ఏంటి నాన్నా! అలా చూస్తున్నావ్?” అని అడిగితే,

“పదేళ్ళయ్యింది కదమ్మా! తనివితీరా చూసుకుంటు… ” అని అంటుండగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

“ఏమయింది నాన్నా! అందరూ బాగున్నారా? అమ్మ బాగుందా?” అని ఆదుర్దాగా ప్రశ్నించింది.

“చందూ! నన్ను క్షమిస్తావా తల్లీ!” అని అడిగాను.

“అయ్యో! అదేంటి నాన్నా! నిన్ను నేను క్షమించడమేంటి? మీరే నన్ను క్షమించాలి!” అంటూ నా చేతులు పట్టుకుంది.

పరస్పరం క్షమించేసుకున్నాము. తరువాత సంఘటనలు చకచకా జరిగిపోయాయి. నేను వచ్చానని చందన చెప్పగానే, అల్లుడు భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వస్తున్నానని చెప్పాడు. కారు డ్రైవరును పంపించి మనుమణ్ణి, మనుమరాలిని స్కూలు నుండి పిలిపించింది. వాళ్ళను చూసి నా కళ్ళు చెమర్చాయి. వాళ్ళ జీవితాల్లో పదేళ్ళ పాటు అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ లేకుండా చేసిన దుర్మార్గుణ్ణనిపించింది. భోజనాలయ్యాక, అల్లుడు ఆఫీసుకు వెళ్తుంటే,

“ఇంటికి రండి అల్లుడు గారూ!” అన్నాను.

“ష్యూర్! మీరెప్పుడు పిలుస్తారా అని చందూ ఎదురు చూస్తుంది.” అన్నాడు.

సాయంత్రం హైదరాబాదు తిరుగు ప్రయాణం అయ్యాను. అమ్మాయి, మనుమడు, మనుమరాలు టాటా చెప్తుంటే, తృప్తిగా ఏర్ పోర్టులోకి నడిచాను.

పదింటికి ఇంటికి చేరిన నన్ను చూసి,

“ఎటు వెళ్ళారండీ! పొద్దటి నుంచి ఫోన్ కూడా కలవడం లేదు. ఎంత కంగారు పడ్డానో తెలుసా!…. ” అని నా భార్య చివాట్లు పెడుతుంటే, కమ్మగా అనిపించింది.

+++

దీపావళి రోజే మా అమ్మాయి చందన పుట్టినరోజు. అందరూ మహాలక్ష్మి పుట్టిందన్నారు. ఆ మహాలక్ష్మే, పదేళ్ళ తర్వాత మళ్ళీ ఈ రోజు మా ఇంట అడుగుపెట్టబోతుంది. శంషాబాద్ ఏరుపోర్టులో దిగగానే చందన ఫోన్ చేసింది. అందుకే, ఇప్పుడో మరో క్షణంలోనో….

ఇంతలో, “అమ్మా!” అని చందన పిలుపు వినబడగానే, నా భార్య ముఖంలో సప్తవర్ణాల ఇంద్రధనస్సు వింతగా మెరిసింది.

+++

నేను కూడా అన్నీ సర్దేసుకున్నాను.

+++

(ఈరోజు ఉదయమే ఈ కథ వాట్సప్‌ ద్వారా మమ్మల్ని చేరింది. చదవగానే మనసంతా భారంగా తయారైంది. ఏదో ఒక ఇదీ అని చెప్పలేని ఉద్వేగం ఊపేసింది. గట్టిగా ఉన్న గుండెలను తడిపి మెత్తగా చేసింది. ఈ కథ రాసిందెవరో తెలియదు కానీ, వారికి ‘మనలోకం’ శతకోటి నమస్సులు అందజేస్తోంది.)

 

విషయం ఇప్పుడే తెలిసింది.

ఈ కథ రాసినవారు శ్రీ ప్రభాకర్‌ జైనీ గారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రభాకర్‌జైని

ప్రభాకర్ జైని ప్రముఖ సాహితీకారుడు, సినీ దర్శకుడు. వాణిజ్య పన్నుల అధికారిగా వృత్తి జీవితం గడిపిన జైనీ బహుముఖ ప్రజ్ఞాశాలి.
ప్రభాకర్‌ జైని లక్ష్మీనారాయణ, శకుంతల దంపతులకు 1955, సెప్టెంబర్ 1న వరంగల్‌ లో జన్మించారు. ఈయన బాల్యం జనగామలో గడిచింది. ప్రభాకర్‌ జైని తండ్రిది మొదటగా నల్గొండ జిల్లా. రజాకార్ల దాడుల్లో సర్వం కోల్పోయిన ఆయన పొట్ట చేతపట్టుకుని వరంగల్‌కు వలస వచ్చారు. చిన్నతనంలోనే నాన్నను పోగొట్టుకోవడంతో తల్లి, ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలి బాధ్యతలను ప్రభాకర్‌ స్వీకరించాడు. ప్రభాకర్‌ జైని తన తండ్రి మరణించిన తర్వాత కారుణ్య నియామకం ద్వారా వరంగల్‌ మున్సిపాలిటీలో ఉద్యోగిగా చేరారు. అనంతరం యూకో బ్యాంకులో ఉద్యోగం చేశారు. తర్వాత వాణిజ్య పన్నుల శాఖలో సీటీవోగా పనిచేస్తూ 2014లో ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
చిన్నతనంలో ప్రభాకర్‌జైని చూసిన సంఘటనలు, చవిచూసిన అనుభవాలే ఆయనను రచయితను, దర్శకుడిని చేశాయి. మొదటి నుంచి రచనారంగంపై ఆసక్తి ఉన్నప్పటికీ, 1981లో ఆయన మొదటి కథ ‘ఎదను ధర్మం’ ప్రచురితమైంది. 1989లో దాదాపుగా ఆయన ఆత్మకథను పోలి ఉండే ‘కాలవాహిని అలల వాలున’ అనే నవలను రాశారు. ఐఏఎస్‌కు ఎంపికైన ఓ పేద విద్యార్థి నేపథ్యాన్ని ఇందులో చిత్రీకరించారు. అప్పట్లో అది ఓ వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. 1992లో రజాకార్ల ఉద్యమ నేపథ్యంతో ‘గమ్యం’, షేర్‌మార్కెట్‌నేపథ్యంతో 1994లో ‘చోర్‌బజార్‌’, 2007లో దుబాయ్‌, పాకిస్థాన్‌నుంచి బంగ్లాదేశ్‌మీదుగా దేశంలోకి నకిలీ కరెన్సీ సరఫరా అవుతున్న విధానాన్ని ‘రూపాయిలొస్తున్నాయ్‌జాగ్రత్త’ అనే నవలగా రాశారు. ఈ నవల కన్నడంలోకి సైతం అనువాదమైంది. 2014లో సినిమాకు సంబంధించి 24 కళలను దర్శకుని కోణం నుంచి తెలిపేలా ‘నా సినిమా సెన్సారైపోయింది’ అనే నవల రాశారు. ఇదే నవల ఆంగ్లంలో ‘ఐ గాట్‌యూ’ పేరుతో ప్రచురితమైంది. 2015లో జీవితం – ఓటమి = గెలుపేనా?, సినీ పరిశ్రమలో ఉండే ఇబ్బందులు, బాధలను నేపథ్యంగా 2017లో ‘సినీవాలి’ నవల రాశారు. ఈ నవలలన్నీ విశేష పాఠకాదరణ పొందాయి. 2018లో ‘లాకర్‌నంబర్‌369’ అనే నవలను కూడా జైనీ రాశారు. తన బాల్యంలో జనగామలో కోటీశ్వరుడిగా బతికిన తనకు మామయ్య వరసయ్యే వ్యక్తి జీవిత చరమాంకంలో దీనస్థితిని నేపథ్యంగా చేసుకుని 2019లో నిఘా అనే నవలను కూడా రాశారు. 2016లో ‘మీల్స్‌టికెట్‌’ కథతో కథలు రాయడం మొదలెట్టిన జైనీ  ఇటీవలే మొత్తం 18 కథలతో మీల్స్ టికెట్‌అనే కథల సంపుటిని తీసుకువచ్చారు.
సాహిత్యంలో తనకంటూ ఓ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అనంతరం సినిమా రంగంపై దృష్టి సారించారు. తెలుగు చిత్రపరిశ్రమకు జాతీయ స్థాయి అవార్డు సాధించిపెట్టడమే ధ్యేయంగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ప్రభాకర్‌ ‘అమ్మా నీకు వందనం’ చిత్రాన్ని, ‘హూ కిల్డ్‌ మి’ అనే లఘు చిత్రాన్ని తీశారు. విలువల వలువలు విప్పేస్తూ స్త్రీల అంగాంగ ప్రదర్శనలతో వికట్టహాసం చేస్తున్న సినిమాలు కాకుండా, మనిషి కేంద్రంగా మానవతా విలువలే లక్ష్యంగా.. సమాజానికి సందేశాన్ని ఇచ్చే లఘు చిత్రాలు, సినిమాలను తీస్తున్నారు. ప్రముఖ రచయిత నవీన్‌ ‘అంపశయ్య’ నవల ఆధారంగా 2016లో ‘క్యాంపస్‌ అంపశయ్య’ అనే చిత్రాన్ని నిర్మించారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన అంపశయ్యను సినిమాగా తెరకెక్కించాలని పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ, లాభాలు తెచ్చిపెట్టదనే కారణంతో ఆ సాహసానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రభాకర్‌ మాత్రం అంపశయ్య చిత్రాన్ని తీసి తీరాలని నిర్ణయించుకుని విజయవంతంగా పూర్తి చేశారు. 2014లో ఆయనను భరతముని ఆర్ట్స్‌ అకాడమీ ఉత్తమ ప్రయోగాత్మక దర్శకుడి అవార్డుతో సన్మానించింది. ఈయన రాసిన నా సినిమా సెన్సార్‌ అయిపోయిందోచ్‌ నవలకుగాను 2014లో నంది అవార్డు లభించింది.
జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి, పేద, మధ్యతరగతి సమాజాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి కావడంతో తనవంతుగా సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. 2006లో తన తండ్రి పేరిట లక్ష్మినారాయణ ఛారిటబుల్‌ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. పాత వరంగల్‌జిల్లాలో ఓ పాఠశాలను దత్తత తీసుకుని ఆ ట్రస్ట్‌ద్వారా విద్యార్థులకు కావాల్సినవి సమకూర్చుతున్నారు. 2007 నుంచి తల్లిదండ్రుల పేరు మీద కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకం అందజేస్తున్నారు. జైనీ ఇంటర్‌నేషనల్‌ఫౌండేషన్‌పేరుతో సాహితీవేత్తలకు ప్రోత్సాహాకాలను కూడా అందిస్తున్నారు. ఇటీవలే తన తల్లి శంకుతల పేరు మీద 12 మంది సాహితీకారులకు స్మారక ప్రోత్సాహక అవార్డులను కూడా అందించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news