కొన్నేళ్ల క్రితం వచ్చిన ఈగ సినిమా మీ అందరూ చూసే ఉంటారు. ఈగ విలన్‌పై ఎలా రివేంజ్ తీర్చుకుంటుందో మీ అందరికీ తెలుసు. కానీ అలానే బయట కూడా జరిగితే. ఈగలు పగబడితే, రివేంజ్ తీర్చుకుంటే.. ఏంటండీ మీరు చెప్పేది అంటారేమో..! ఇది నిజమే.. ఆ గ్రామంపై ఈగలు పగబట్టాయి. పాపం ఆ గ్రామంలో ఉన్నవాళ్లకు పెళ్లిళ్లు అవడం లేదట. ఊరంతా తండోపతండాలుగా ఈగలే.!
అక్కడ చాలా ఈగలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో, ప్రతిచోటా ఈగలే. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంట్లో ఉంచే వస్తువులపై ప్రతిచోటా ఈగలు కనిపిస్తాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పరిస్థితి ఇంకా అధ్వానంగా మారింది. ఎక్కడికక్కడ ఈగలు ఎగురుతుంటే గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో తయారుచేసిన ఆహారం, పానీయాలలో ఈగలు కనిపిస్తాయి. నిజానికి ఆ ఈగలు స్థానికులను కనీసం కంటి నిండా నిద్రపోనివ్వట్లేదు. ఈగల కారణంగానే ఆ గ్రామంలో యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. తమ కూతురిని ఆ ఊరి అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఏ తండ్రీ ముందుకు రావట్లేదు. ఆ ఊళ్లో అత్తారింటికి వచ్చే అమ్మాయిలు.. ఊరు వదిలేసి వెళ్లాల్సిందే. విడాకులు ఇచ్చేస్తామని కూడా అంటున్నారు. అరెరే.. పెద్ద సమస్యే వచ్చిందే..
ఉత్తరప్రదేస్‌లోని ఉన్నావ్ జిల్లా వాబ్‌గంజ్ బ్లాక్‌లోని… రుద్వార్ అనే గ్రామంలో ఈగల దండయాత్ర కొనసాగుతోంది. అక్కడి స్థానికుల ఇళ్లకు చుట్టాలు రావట్లేదు. ఎన్ని పురుగు మందులు, కీటకనాశినులు వాడుతున్నా.. ఈగల సంఖ్య పెరుగుతుందే ఏమాత్రం తగ్గడం లేదు. ఈగలకు ప్రధాన కారణం నానాటికీ పెరుగుతున్న పౌల్ట్రీ ఫాం వ్యాపారమే. కరోనా తర్వాత ప్రజలు కోళ్ల పెంపకం ప్రారంభించారు. మొదట్లో మంచి లాభాలు వచ్చాయి. దాంతో చాలా మంది కోళ్లఫారాలు ప్రారంభించారు. ఎక్కడ చూసినా పౌల్ట్రీ ఫారాలే.
గ్రామంలో కోళ్ల ఫారాలు ప్రారంభించినప్పటి నుంచి అపరిశుభ్రత, దుర్వాసన పెరిగి… ఈగలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. సుమారు 5 వేల జనాభా ఉన్న ఆ గ్రామంలోని ప్రజలు దోమతెరలోపల ఉంటూ తినాలన్నా భయపడిపోతున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా ఆ గ్రామంలో పౌల్ట్రీ ఫామ్‌లను తొలగించటం లేదు. నిజానికి ఊరి శివార్లలో జనాభాను బట్టి ఒకటి లేదా రెండు ఉండాలి. కానీ ఆ ఊరంతగా ఇళ్ల మధ్యలోనే ఇలా ఫారాలు ఉండటం వల్ల సమస్య ఈ రేంజ్‌లో ఉంది.