నగలు, చీరలను కొనడంలో మహిళలను ఎంత ఆసక్తి చూపుతారో అందరికీ తెలిసిందే. పక్కింటి మహిళ తనకన్నా ఇంపైన చీర కట్టుకుంటే తోటి మహిళలకు అదోలా అనిపిస్తుంది. దీంతో వారు కూడా తామేం తక్కువ తినలేదని చాటుతూ అంతకు దీటైన చీర కొని, కట్టుకుని ప్రదర్శిస్తుంటారు. అయితే చీరలపై మహిళలకు ఉండే ఆసక్తి విషయం ఏమో గానీ.. ఓ షాపింగ్ మాల్ ఆరంభం రోజునే కేవలం రూ.10కే చీర ఇస్తామంటూ ప్రకటించే సరికి పెద్ద ఎత్తున మహిళలు అక్కడికి చేరుకున్నారు. షాప్ ఓపెన్ అవగానే ఒక్కసారిగా మహిళలందరూ లోపలకి వెళ్లాలని చూసే సరికి అక్కడ తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు మహిళలకు గాయాలవ్వగా, ఓ మహిళకు చెందిన బ్యాగులోని నగదు, ఆభరణాలు, ఏటీఎం కార్డు చోరీకి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..
సిద్దిపేట పట్టణంలో ఓ ప్రముఖ సంస్థ ఇవాళ షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది. అందులో ప్రత్యేక ఆఫర్ పేరిట కేవలం రూ.10 కే చీర ఇస్తున్నామంటూ వారు ముందుగానే ప్రకటించారు. దీంతో షాపింగ్ మాల్ వద్దకు మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే మాల్ ఆరంభం కాగానే అందులో ఉన్న సెల్లార్‌లో రూ.10 చీరలను విక్రయించడం ప్రారంభించారు. దీంతో మహిళలు పెద్ద ఎత్తున గుమిగూడారు. చాలా మంది ఒకేసారి అక్కడకు చేరుకున్నారు. దీంతో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. ఆ తరువాత తొక్కిసలాట జరిగింది.
అలా మాల్‌లో జరిగిన తొక్కిసలాటలో 10 మంది మహిళలకు గాయాలయ్యాయి. కొందరు మహిళలు ఎటు వెళ్లాలో తెలియక అక్కడే పడిపోయారు. ఇక నంగునూరు మండలం తిమ్మాయిపల్లికి చెందిన ఊర్మిళ అనే మహిళ బ్యాగులోని ఐదున్నర తులాల బంగారు నగలు, రూ.6వేల నగదు, ఒక ఏటీఎం కార్డు చోరీకి గురయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. షాపింగ్ మాల్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..!