శృంగారం: మీ భాగస్వామితో మర్చిపోలేని రాత్రిని ప్లాన్ చేసుకోవడానికి పనికొచ్చే చిట్కాలు..

భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా వారిద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచేది శృంగారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి దాకా దూరమైన మనసులు శరీరాలు ఏకమవడంతో దగ్గరైపోతాయి. ఐతే రోజూ ఇలాగే జరుగుతుంటే గనక వారిద్దరిలో ఏదో సమస్య ఉన్నట్లు గుర్తించాలి. అది వేరే విషయం. ఇక ప్రస్తుతానికి వస్తే, భాగస్వామ్య బంధంలో శృంగారం అనేది కీలక పాత్ర వహిస్తుంది. అందుకే దానికి చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి.

దానికోసం మీ భాగస్వామితో మర్చిపోలేని రాత్రులు గడపాలి. అలాంటి రాత్రులు గడపడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ప్లాన్ చేయవద్దు

ఎప్పుడైనా సరే ప్లాన్ చేయవద్దు. ప్లానింగ్ లేకుండా గడిచిన క్షణాలు గమ్మత్తుగా ఉంటాయి. ఏదో ఒక రోజున చేతిలో మల్లెపూలు పట్టుకుని ఇంటికి వచ్చారంటే, ఆ రాత్రి మీ జీవితంలో మర్చిపోలేనిదిగా మారే అవకాశం ఉంది. అలాగే ఆడవాళ్ళైతే ఉన్నంతలో అందంగా రెడీ అయితే చాలు, మీ భాగస్వామిలో కోర్కెలు చెలరేగి ఆ రాత్రి జీవితంలో మర్చిపోలేనిదిగా మారవచ్చు.

బయటకు వెళ్ళండి

ఎప్పుడూ ఇంట్లోనే ఉండి ఒక్కసారి బయటకు వెళ్తే ఆ గమ్మత్తు మరోలా ఉంటుంది. పెద్దగా డబ్బు అవసరం లేని విలాస ప్రాంతాల్లో పర్యటించండి. ఆ వాతావరణంలో గాలులు మీలో కోర్కెలను రెచ్చగొట్టి, అందమైన అనుభవాన్ని అందిస్తాయి.

సర్ప్రైజ్

ప్రేమను ప్రకటించడం చాలా ముఖ్యం. అది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అవతలి వారికి ఇష్టమైన దాన్ని వారికి అందించినపుడు వారి కళ్ళల్లో కనబడే సంతోషం సరిగమలు పలికించి అద్భుతమైన సాయంత్రాన్ని మీకందిస్తుంది.

ఇంటి పనుల్లో భాగం అవడం

చాలామంది భాగస్వాములు చేసే తప్పు ఇదే. అవతలి వారి పనుల్లో భాగం పంచుకోకుండా ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. వారి పనుల్లో భాగం పంచుకుని, వారి పనులను సులభతరం చేయండి. అది వారిలో ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో అర్థం అవుతుంది.