రొమాన్స్ బాగుంటే మీ బంధం బాగుంటుంది.. అసలు నిజమైన రొమాన్స్ ఎలా ఉండాలంటే?

భార్యా భర్తల మధ్య బంధంలో అప్పుడప్పుడూ గొడవలు సహజమే. ఇద్దరు కలిసి ఒకే చోట ఉంటారు కాబట్టి, ఆ మాత్రం గొడవలు జరుగుతుంటాయి. మరి అసలు చిన్నపాటి గొడవ కూడా జరగడం లేదంటే వాళ్ళు అన్యోన్యంగా ఉంటున్నట్లు కాదు. ఒకరినొకరు పట్టించుకోవడం లేదన్నట్లు. అలా అని రోజూ గొడవలు పడమని కాదు. చిన్న చిన్న అలకలు, అల్లర్లు కామనే అని ఉద్దేశ్యం. ఐతే ఎన్ని గొడవలు వచ్చినా, ఎంత అలకబూనినా ఒకచోట వారిద్దరూ కలవాల్సి ఉంటుంది.

అలా కలుసుకున్నప్పుడు అవన్నీ మర్చిపోగలిగితే బాగుంటుంది. నిజానికి భార్యా భర్తల మధ్య బంధాన్ని దృఢం చేసేది రొమాన్సే. ఇక్కడ రొమాన్స్ అనగానే మరేదో అనుకుని ఆలోచించకండి. శృంగారానికి ముందు చేసేదే రొమాన్స్ అనుకుంటే పొరపాటే. భార్యా భర్తలు వారితో వారు ఎలా ప్రవర్తిస్తున్నారనేది కూడా రొమాన్సే.

ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన భర్త కోసం వేడి వేడ్ టీ అందించడం, ఇంటి దగ్గర తను ఒంటరిగా ఉంటుందని ఆఫీసు అయిపోగానే మరే పని పెట్టుకోకుండా ఇల్లు చేరుకోవడం, రాత్రిపూట భోజనం తయారు చేసే సమయంలో చిన్న చిన్న సాయం చేసి పెట్టడం, వీలైతే కూరగాయలు తరగడం, ఇంకా వీలైతే అప్పుడప్పుడు వంట తనే ప్రిపేర్ చేయడం. ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి భార్యని చులకనగా చూడకుండా, తాను చేస్తున్న పనికి వాల్యూ ఇవ్వడం, భార్యకి కావాల్సినంత స్వేఛ్ఛని ఇవ్వడం ఇవన్నీ రొమాన్స్ లో భాగాలే.

అప్పుడప్పుడూ ఐలవ్యూ చెప్పడం, నెలకి ఒక సినిమా, లేదంటే బయటకి వెళ్ళడం మొదలగునవన్నీ రొమాన్సే. ఎప్పుడైతే ఇద్దరి మధ్య బంధం గొళుసులతో కట్టేసినట్టు కాకుండా ఉంటుందో అప్పుడే ఆ బంధం ఎక్కువ ఏళ్ళు పదిలంగా ఉంటుంది. అలా ఉండాలంటే రొమాన్స్ చాలా ముఖ్యం. అది లేకపోతే మీ మధ్య జరిగిన చిన్న చిన్న అల్లర్లే పెద్దగా మారి మీ జీవితాల్లో పెను మార్పుకి గురి చేస్తాయి.