750 కిలోల ఉల్లిగడ్డలు 1064 రూపాయలకు అమ్ముడుపోయాయి. అంటే కిలో ఉల్లిగడ్డ ఎంతకు పడ్డట్టు చెప్పండి… కిలో ఉల్లిగడ్డ రూపాయి నలబై పైసలు పడ్డట్టు లెక్క. అంతే కదా. ఇది ప్రస్తుతం మహారాష్ట్రలోని ఉల్లిగడ్డ రైతుల దుస్థితి. అందుకే.. నాసిక్ జిల్లాలోని నిఫాద్ కు చెందిన సంజయ్ సాతె అనే రైతు 750 కిలోల ఉల్లిగడ్డలు అమ్మగా వచ్చిన 1064 రూపాయలను ప్రధాని మోదీకి పంపించాడు. విపరీతంగా పడిపోయిన ఉల్లిగడ్డ ధరలపై నిరసనగా ఆయన ఆ డబ్బును మోదీకి పంపించాడు.
అయితే.. ఇక్కడే మరో విశేషం ఉంది. ఆ సంజయ్ సాతె ఎవరో కాదు. ఆయన గురించి తెలుసుకోవాలంటే మనం ఓసారి 2010కి వెళ్లాలి. అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ బరక్ ఒబామా భారత్ కు వచ్చినప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశంలోని కొంతమంది రైతులను ఒబామాతో మాట్లాడించింది. కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ను అప్పుడు సెలెక్ట్ చేసింది. అంటే.. ఎక్కువ దిగుబడి సాధించే రైతులు గానీ.. సహజ సిద్ధంగా పంటలు పండించే రైతులు గానీ.. ఇలా కొంతమంది రైతులను సెలెక్ట్ చేసి ఒబామాతో కలిపించింది. వాళ్లలో ఈ సంజయ్ ఒకరన్నమాట.
“నేను ఈ సీజన్ లో 750 కిలోల ఉల్లిగడ్డలు పండించా. కానీ.. నిఫాద్ హోల్ సేల్ మార్కెట్ లో నా ఉల్లిగడ్డలకు రూపాయికే కిలో లెక్క చెల్లించారు. నేను వాళ్లను బతిమిలాడితే చివరకు 1.40 పైసలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీంతో నాకు 750 కిలోల ఉల్లిగడ్డలు అమ్మగా 1064 రూపాయలు వచ్చాయి. నాలుగు నెలలు కష్టపడితే నాకు వచ్చిన ఫలితం అది. దీంతో నాకు చిర్రెత్తుకొచ్చి నిరసన తెలపాలనుకున్నా. అందుకే.. 1064 రూపాయలను పీఎంవోకు అనుసంధానంగా ఉండే డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కు పంపించా. దాన్ని మనియార్డర్ చేయడానికి మరో 54 రూపాయలు నేనే భరించాల్సి వచ్చింది. నాకు రాజకీయం తెలియదు. నేనే పార్టీకి చెందిన వాడిని కాదు. మా బాధలు ప్రభుత్వాలకు పట్టట్లేవు. మా మీద వాళ్లకు ఉన్న ఉదాసీనతపైనే నాకు చాలా కోపం వస్తోంది..” అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు సంజయ్.
భారతదేశంలో ఉల్లిగడ్డల ఉత్పత్తిలో 50 శాతం ఉత్పత్తి ఒక్క నాసిక్ జిల్లా నుంచే ఉత్పత్తి అవుతుంది.