pet dogs: ఈ రోజుల్లో.. ఇంట్లో ఏదో ఒక పెంపుడు జంతువును పెంచుకోవడం అందరికీ అలవాటుగా మారిపోయింది. ఇంట్లో వాళ్లకు అదే పెద్ద టైమ్‌పాస్. కానీ ఎక్కడికైనా వెళ్లాలంటే.. వాటిని కూడా మనతోపాటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ సొంత వాహనం లేకుంటే.. వాటితో కలిసి ట్రావెల్ చేయడం కష్టమైన పనే. పెంపుడు కుక్కల యజమానులకు ఇన్ని రోజులు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. కుక్కల యజమానులు విదేశాలకు, లేదంటే వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇంట్లో కుక్కను ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. అదే వెహికల్స్‌లో తీసుకెళ్లాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం ముఖ్యం.
విమానయాన నిబంధనలు ప్రయాణీకులు క్యాబిన్‌లో నిర్దిష్ట పరిమాణంలో పెంపుడు జంతువులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనుమతిస్తాయి. వాటిని సీట్లకు దగ్గరగా ఉంచే సదుపాయం కూడా ఉంది. విమానంలో అనుమతించినట్లుగా రైలులో పెంపుడు జంతువులను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. రైళ్లలో పెంపుడు జంతువులతో ప్రయాణం చేయడంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. కుక్కలతో రైలు ప్రయాణాన్ని నిరోధించేందుకు భారతీయ రైల్వే కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆ రూల్స్ ఏంటంటే..
కొత్త నిబంధనల ప్రకారం కుక్కలను రైళ్లలో ఫస్ట్ క్లాస్ కాకుండా మరే తరగతిలోనూ రవాణా చేయరాదు. ప్రత్యేకించి ప్రయాణీకుడు ఫస్ట్ క్లాస్‌లో నాలుగు బెర్త్‌లు లేదా ఒక కంపార్ట్‌మెంట్ బుక్ చేసుకుంటేనే ఈ ఆఫర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాని PNR నంబర్‌తో పాటు ఒక కుక్కను తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.
కుక్కను నేరుగా రైలులో ఎక్కించలేరు. రైలు బయలుదేరే మూడు గంటల ముందు కుక్కను లగేజీ కార్యాలయానికి తీసుకురావాలి. అధికారులు పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాతే క్యారేజీని ఎక్కించాలి. ఫస్ట్ క్లాస్ కాకుండా వేరే క్లాసులో ప్రయాణిస్తూ పట్టుబడితే జరిమానా తప్పదు. అలా చేయకుండా దొరికిపోతే జైలు శిక్షే..
కుక్క జాతి, రంగు, లింగాన్ని సామాను రిజర్వేషన్ కార్యాలయంలో పేర్కొనాలి. డాక్టర్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి. ప్రయాణికులు తమ సొంత ఆహారం మరియు నీటిని అందించాలి. లోకల్ ప్యాసింజర్ రైళ్లలో కుక్కలతో ప్రయాణించడాన్ని రైల్వే నిషేధించింది.
భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 77-A ప్రకారం జంతువుల కోసం ప్రత్యేకించబడిన కంపార్ట్‌మెంట్లలో పెంపుడు కుక్కలు రైళ్లలో ప్రయాణించవచ్చు. దానికి కూడా కొంత మొత్తం డబ్బు చెల్లించాలి. అయితే జర్నీలో కుక్కలకు ఏమైనా జరిగితే రైల్వే అధికారులకు ఎలాంటి బాధ్యత ఉండదు. అంతే కాదు జర్నీలో డాగ్స్‌కి భోజనం, జబ్బు చేస్తే మందులు, తాగేందుకు నీళ్లు వంటివి రైల్వే అధికారులు ఏర్పాటు చేయరు. అంతే కాదు చివరకు రైలు ప్రమాదంలో ప్రయాణికుడి పెంపుడు కుక్క చనిపోయినా పరిహారం ఉండదు.