భవిష్యత్తులో రిలేషన్ షిప్ చెడిపోతుందని జాగ్రత్త పరిచే సంకేతాలు… మొదట్లోనే గుర్తించండి.

రిలేషన్ షిప్ Relationship ఎంత బాగుంటుందో అంత ఇబ్బంది పెడుతుంది. మానసికంగా, శారీరకంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రిలేషన్ షిప్ లోకి దిగే ముందు చాలా ఆలోచించాలి. ఒకవేళ దిగినా కూడా ఆదిలోనే రిలేషన్ షిప్ ఎటు పోతుందనే విషయాన్ని అవతలి వారి చేష్టల ద్వారా గుర్తించాలి. ఇలాంటివి మొదట్లో గుర్తిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. అందులో నుండి బయటపడాలన్న పెద్ద ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం రిలేషన్ షిప్ మొదట్లో అవతలి వారి అలవాట్ల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

రిలేషన్ షిప్ /Relationship

సొంతం అనే భావన

నువ్వు నాకే సొంతం, నా అనుమతి లేనిదే వేరే వాళ్లతో మాట్లాడకూడదు వంటి ఆలోచనలు ముందుగానే కనిపించినట్లయితే వెంటనే జాగ్రత్త పడాలి. ఇలాంటివి మొదట్లో బాగానే అనిపిస్తాయి. కానీ రాను రాను మానసిక శాంతిని దూరం చేస్తాయి. స్వేఛ్ఛని పంజరంలో బంధించినట్టుగా ఫీలవుతారు.

హద్దులకు గౌరవం ఇవ్వకపోవడం

ఏ విషయంలో అయినా హద్దులు ఉంటాయి. ఆ హద్దులకు అవతలి వారు గౌరవం ఇవ్వనపుడు ఎక్కువ ఆలోచించకండి. ఎందుకంటే భవిష్యత్తులో మీకంటూ ఓ గీత లేకుండా పోతుంది. మీకోసం మీ స్పేస్ కనిపించదు.

నియంత్రణ

మీ ఆలోచనలని, మీ నిర్ణయాలని అవతలి వారు కంట్రోల్ చేయాలని చూస్తుంటే జాగ్రత్త పడాలి. ఇవి ఎలా ఉంటాయంటే, ఒక్కోసారి మీకే అనిపిస్తుంది. నేను నిర్ణయాలు తీసుకోలేనేమో అని.

కోపం

చిన్న దానికే పెద్దగా అరిచే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఉరిమి చూడడం, చేతిలో ఉన్న వస్తువులను నేలకేసి కొట్టడం వగైరా చేస్తుంటే మీ బంధానికి అదే పెద్ద ప్రతిబంధకంగా మారవచ్చు.

రహస్యంగా ఉండేవారు

తమ గురించి అసలేమీ చెప్పకుండా, మీ గురించి పట్టించుకోకుండా ఉండేవారితో జాగ్రత్త. ఎందుకంటే, వీరికి మీ గురించి పట్టింపు ఉండదు. ఎమోషనల్ అవసరం ఉన్న సమయాల్లో వీరు మీ పక్కన ఉండరు. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఆ బంధం మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకుండా ఉండడమే మంచిది.