ఎన్నో వేల మందిని ఆ మృత్యుదీవి పొట్టన పెట్టుకుంది. దీంతో ఆ దీవిలో చనిపోయినవారంతా దెయ్యాలై తిరుగుతున్నారని ఆ తరువాతి కాలంలో ప్రచారమైంది.
మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. ఎవరూ వాటిని ఛేదించలేకపోయారు. ఈ క్రమంలో అలాంటి మిస్టరీలు ఉన్నప్రాంతాల గురించి ఇప్పుడిప్పుడే చాలా మంది తెలుస్తోంది. అయితే అలాంటి మిస్టరీలు ఉన్న ప్రాంతాల్లో జపాన్‌లోని ఆ దీవి కూడా ఒకటి. అక్కడ అడుగు పెట్టే ఎవరూ కూడా ఇప్పటి వరకు వెనక్కి తిరిగిరాలేదు. అవును, వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నప్పటికీ.. ఇది నిజమే.. ఇంతకీ ఆ దీవి ఎక్కడుందంటే…
జపాన్‌లోని నాగసాకి నగరం నుంచి 1 గంట సేపు నీటిలో ప్రయాణిస్తే ఆ దీవికి చేరుకోవచ్చు. అదే హషిమా ఐల్యాండ్. దీన్ని ఘోస్ట్ టౌన్ (దెయ్యాల పట్టణం) అని కూడా పిలుస్తారు. అలాగే స్థానికులు ఈ దీవిని గుంకంజిమా అని కూడా అంటారు. ఈ దీవిని పై నుంచి చూస్తే యుద్ధ నౌకను పోలి ఉంటుంది. దీంతో ఈ దీవిని బ్యాటిల్‌షిప్ ఐల్యాండ్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ దీవికి ఎవర్నీ ఒంటరిగా వెళ్లేందుకు అనుమతించరు. ఎందుకంటే.. ఈ దీవికి ఒంటరిగా వెళ్లినవారు ఇప్పటికీ తిరిగి రాలేదు. వారు ఏమైపోయారో కూడా తెలియదు. అందుకని జపాన్ ప్రభుత్వం పర్యాటకులను కేవలం బృందాలుగా మాత్రమే ఈ దీవికి పంపించేందుకు అనుమతినిస్తుంటుంది.
అయితే ఈ దీవి, దాని చుట్టూ పరిసరాల్లో వాతావరణ పరిస్థితులు చాలా భీకరంగా ఉంటాయి. ఈ క్రమంలో ఏడాదిలో కేవలం 100 రోజులు మాత్రమే ఈ దీవిలో ఉండేందుకు అనువుగా ఉంటుంది. అందుకని అదే రోజుల్లో పర్యాటకులను ఈ దీవిలోకి అనుమతిస్తుంటారు. అయితే ఒక్కోసారి వాతావరణం అనుకూలించకపోతే ఆ రోజుల్లోనూ ఈ దీవిలోకి వెళ్లలేరు. ఇక ఈ దీవిలో ఇంత మిస్టరీ దాగి ఉండడానికి దానికి ఉన్న చరిత్రే కారణమని చాలా మంది చెబుతుంటారు.
హషిమా ఐల్యాండ్ చరిత్ర చెప్పాలంటే.. నిజానికి అది ఒక కేజీఎఫ్ సినిమాయే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఒకప్పుడు ఈ దీవిలోనూ బొగ్గు గనులు ఉండేవట. దాంతో 1890లో మిత్సుబిషీ కార్పొరేషన్ ఈ దీవిని కొనుగోలు చేసి అందులో మైనింగ్ పనులు ప్రారంభించింది. అయితే ఆ పనుల కోసం ఆ కంపెనీకి పెద్ద ఎత్తున కూలీలు అవసరం అయ్యారు. దీంతో అప్పట్లోనే సుమారుగా 3వేల మంది మైనింగ్ పని కోసం ఆ దీవికి వచ్చారు. దీంతో వారు ఆ దీవిలో నివాసం ఉండేందుకు వారి కోసం అక్కడే భారీ అపార్ట్‌మెంట్లను నిర్మించారు.
అయితే ఒక కుటుంబానికి ఒకే గది ఇవ్వడంతో ఆ కూలీలకు ఆ గదుల్లో నరకం కనిపించేది. దీంతో వారందరిదీ అక్కడ జైలు జీవితమే అయ్యిందని చెప్పవచ్చు. ఇక 1959లో ఆ దీవి జనాభా 5,259 కు చేరుకోగా ఆ దీవిలో నివసించే కూలీల పరిస్థితి మరింత దయనీయమైంది. ఇక వారిలో చాలా మంది కూలీలు యుద్ధ ఖైదీలే. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ బంధించిన 41వేల మంది యుద్ధ ఖైదీల్లో సుమారుగా 3765 మందిని ఈ దీవికి తరలించారు. వారితో బలవంతంగా మైనింగ్ పనులు చేయించుకునేవారు. పనులు చేయకపోతే హింసించేవారు. ఆ కూలీలకు సరిగ్గా ఆహారం పెట్టేవారు కాదు. దీంతో చాలా తక్కువ కాలంలోనే వారంతా అనారోగ్య సమస్యల బారిన పడి శుష్కించి అస్థిపంజరాల్లా మారారు. కొందరు ఆకలితోనే ప్రాణాలు విడిచారు.
ఇక ఆ దీవిలో దుర్భరమైన జీవితం గడిపే కన్నా చావే మంచిదని కొందరు పక్కనే ఉండే సముద్రంలో దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు తప్పించుకోవాలని చూసి సముద్రంలో ఈదలేక చనిపోయారు. మరికొందరు మైనింగ్ పనులు చేయలేక చిత్రహింసలకు గురై చనిపోయారు. ఇలా ఎన్నో వేల మందిని ఆ మృత్యుదీవి పొట్టన పెట్టుకుంది. దీంతో ఆ దీవిలో చనిపోయినవారంతా దెయ్యాలై తిరుగుతున్నారని ఆ తరువాతి కాలంలో ప్రచారమైంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తరువాత మాత్రం ఆ దీవిలో బందీలుగా ఉన్న కొందరు కూలీలకు విముక్తి లభించింది. దీంతో వారు అక్కడి నుంచి బయటపడ్డారు.
అయితే.. అంతకుముందు ఆ దీవిలో జరిగిన మారణహోమంతో అక్కడ దెయ్యాలు ఉన్నాయని బాగా ప్రచారం జరిగింది. దీంతో ఆ దీవిని పర్యాటక ప్రదేశంగా మారుద్దామనుకున్న జపాన్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో ఆ దీవి అప్పటి నుంచి అలాగే పాడుబడిన భవనాలు, నిర్మాణాల శిథిలాలతో భీతి గొలిపే విధంగా మారింది. అక్కడ జనాలు కూడా ఎవరూ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో ఆ దీవి నిర్మానుష్యంగా మారింది. అయితే క్రమంగా ఆ దీవి పట్ల పర్యాటకులు ఆకర్షితులు అయ్యారు. అక్కడికి వెళ్లేందుకు చాలా మంది పర్యాటకులు ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారు. దీంతో జపాన్ ప్రభుత్వం పర్యాటకులకు ఆ దీవిలోకి వెళ్లేందుకు అనుమతినిచ్చింది.
అయితే మొదట్లో ఆ దీవిలోకి సింగిల్‌గా కొందరు పర్యాటకులు వెళ్లగా వారు ఇప్పటి వరకు తిరిగిరాలేదు. వారి జాడ కూడా అసలు తెలియదు. దీంతో ఆ దీవిలో దెయ్యాలే వారిని చంపేశాయని ప్రచారం ప్రారంభమైంది. ఇక కొందరు పర్యాటకులు అయితే ఆ దీవిలోని పలు నివాసాల్లో, అపార్ట్‌మెంట్లలో ఉండే వస్తువులు వాటంతట అవే కదలడం, రాత్రి వేళల్లో అరుపులు వినిపించడం చూశారట. దీంతోపాటు కొందరికి పలు ఆకారాలు కూడా కనిపించాయట. ఈ క్రమంలో ఆ దీవిలో దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం మరింత ఎక్కువైంది.
అలా హషిమా ఐల్యాండ్ లో దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువవడం, ఒంటరిగా వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో.. జపాన్ ప్రభుత్వం ఆ దీవిలోకి పర్యాటకులను బృందాలుగా మాత్రమే వెళ్లాలని సూచించింది. అలాగే బృందాలకే ఆ దీవిలోకి వెళ్లేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటికీ ఆ దీవిలోకి పర్యాటకులు బృందాలుగా మాత్రమే.. అది కూడా పగటిపూటే వెళ్తుంటారు తప్ప.. రాత్రివేళల్లో అక్కడ ఉండేందుకు మనుషులెవరూ సాహసం చేయడం లేదు. ఇక ఈ దీవిలోకి ఒంటరిగా వెళ్లినవారు గల్లంతైన విషయం ఇప్పటికీ మిస్టరీయే. వారి ఆచూకీ తెలియకపోవడంతో.. వారిని దెయ్యాలే చంపాయని కొందరు అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తున్నారు. ఆ దీవిలో ప్రస్తుతం ఉన్న భీకర వాతావరణ పరిస్థితుల వల్లే వారు చనిపోయి ఉంటారని కొందరు భావిస్తున్నారు.
అయితే అక్కడికి వెళ్లి వచ్చిన కొందరు పర్యాటకులు మాత్రం.. తమకు దెయ్యాల ఆకారాలు కనిపించాయని.. అవి తమ వెనుక నుంచి వచ్చి తమను తాకాయని.. కనుక ఆ దీవిలో దెయ్యాలు ఉన్నాయన్న విషయం ముమ్మాటికీ నిజమేనని.. కొందరు పర్యాటకులు చెబుతున్నారు. కాగా జపాన్ ప్రభుత్వం మాత్రం ఆ దీవిని టూరిస్ట్ ప్లేస్‌గా చేయాలని చూస్తోందట. మరి.. ఆ విషయంలో ఆ దేశ ప్రభుత్వం సక్సెస్ అవుతుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!