కేరళ, తమిళనాడు, కర్ణాటక.. మూడు రాష్ట్రాలు కలిసే సరిహద్దు ప్రాంతంలో వయనాడ్ ఉంటుంది. దీన్ని ఒకప్పుడు వయల్ నాడు అని పిలిచేవారు. అంటే వరిపొలాలు అని అర్థం వస్తుంది.
లోక్‌సభ ఎన్నికల పుణ్యమా అని కేరళలోని పార్లమెంట్ నియోజకవర్గం వయనాడ్ ఇప్పుడు ఎంతో పాపులర్ అయింది. కొద్ది రోజుల వరకు ఈ నియోజకవర్గం గురించి దాదాపుగా చాలా మందికి అంతగా తెలియదు. ఇదొక పర్యాటక ప్రాంతమని కేవలం పర్యాటకులకు మాత్రమే తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో.. ఇప్పుడందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. ఈ క్రమంలో వయనాడ్ గురించి తెలుసుకునేందుకు ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి మనం కూడా వయనాడ్ గురించి, దాని విశేషాల గురించి తెలుసుకుందామా..!
కేరళ, తమిళనాడు, కర్ణాటక.. మూడు రాష్ట్రాలు కలిసే సరిహద్దు ప్రాంతంలో వయనాడ్ ఉంటుంది. దీన్ని ఒకప్పుడు వయల్ నాడు అని పిలిచేవారు. అంటే వరిపొలాలు అని అర్థం వస్తుంది. కాలక్రమేణా వయల్ నాడు.. వయనాడ్ అయింది. వయనాడ్ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణానికి, ప్రకృతి శోభకు పెట్టింది పేరు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలు మనకు చక్కని ఆహ్లాదాన్ని ఇస్తాయి. మనస్సుకు ప్రశాంతత కలిగిస్తాయి. ప్రకృతి ముగ్ద మనోహరతకు వయనాడ్ ప్రాంతం పెట్టింది పేరు. దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ అత్యంత ప్రకృతి సౌందర్యం ఉన్న ప్రాంతంగా వయనాడ్ పేరుగాంచింది.
వయనాడ్‌లో ఉన్న చంబ్రా శిఖరం కాల్పట్టాకు సమీపంలో ఉంటుంది. ఈ శిఖరం సముద్ర మట్టానికి సుమారుగా 2100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వయనాడ్‌లోకెల్లా ఇదే అత్యంత ఎత్తయిన శిఖరం కావడం విశేషం. కాగా ఈ శిఖరంపై ఓ సరస్సు హృదయాకారంలో ఉంటుంది. దీన్ని చూసేందుకు ఏటా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
వయనాడ్‌లో ఉన్న మరో ఆకర్షణ.. మీన్‌ముట్టి వాటర్‌ఫాల్. కేరళలో ఉన్న సుందరమైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ జలపాతం వద్దకు చేరాలంటే కొంత సాహసం చేయక తప్పదు. సుమారుగా 2 కిలోమీటర్ల ఉన్న దట్టమైన అడవి మార్గంలో ప్రయాణిస్తేనే ఈ వాటర్ ఫాల్ వద్దకు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. సాహసం చేసే వారికి ఇదొక చక్కని స్పాట్‌గా చెప్పవచ్చు.
వయనాడ్‌లో ఉన్న ఇడక్కల్ గుహలు నెన్‌మేని అనే ప్రాంతంలో ఉంటాయి. ఇవి సహజసిద్ధమైన రాళ్లతో ఏర్పడ్డాయి. ఆ రాళ్లకు ఎన్నో వేల ఏళ్ల వయస్సు ఉంటుందని చెబుతారు. క్రీస్తు పూర్వం 6వేల కాలం నాటి గుహలు ఇవని అంటారు.
వయనాడ్‌లోని బాణాసుర సాగర్ జలాశయం కూడా ఒక పర్యాటక కేంద్రమే. కేరళలోని అతి పొడవైన జలాశయాల్లో ఇది కూడా ఒకటిగా పేరు గాంచింది. ఇక్కడికి వెళ్లడానికి బోటింగ్, ట్రెక్కింగ్, నడక వంటి మార్గాలను అనుసరించవచ్చు. 2017లో ఇక్కడ భారత్‌లోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను నిర్మించారు.
తోల్పెట్టి వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా వయనాడ్‌లో ఉన్న ముఖ్య పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా పేరు గాంచింది. ఇక్కడి కేంద్రంలో అనేక రకాల జంతువులను సంరక్షిస్తుంటారు. వాటిని చూస్తూ ఒక రోజంతా హాయిగా గడిపేయవచ్చు.
వయనాడ్‌లోని లక్కిడి అనే ప్రాంతంలో చైన్ ట్రీ ఉంటుంది. ఆ చెట్టుకు, కింద ఉన్న ఓ నిర్మాణానికి చెయిన్ ఉంటుంది. దీన్ని 17వ శతాబ్దంలో ఏర్పాటు చేశారట. అప్పట్లో ఈ చెట్టు ఉన్న దారి వెంట వెళ్లే వారు ప్రమాదాల బారిన పడేవారట. దీంతో ఆ చెట్టు సమీపంలో దెయ్యం ఉందని భావించేవారట. అందుకనే దెయ్యాన్ని చెయిన్‌తో బంధించారని చెబుతారు. అయితే అలా చేశాకే అక్కడ రోడ్డు ప్రమాదాలు తగ్గాయట.
కాల్పెట్టా పరిధిలో ఉన్న సూచిపరా జలపాతం 200 మీటర్ల ఎత్తులో చూపరులను కట్టి పడేస్తుంది. వీక్షకుల మనస్సు దోచుకుంటుంది. కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకే పరిమాణంలో ఇక్కడ పైనుంచి నీళ్లు కిందకు పడుతుంటాయి.
వయనాడ్‌లో తేయాకు తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలు కూడా ఎక్కువే. వాటిని చూస్తుంటే మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. పచ్చని ప్రకృతి వాతావరణంలో ప్రకృతి సౌందర్యాలను ఎంత సేపు చూసినా తనివి తీరదు.