ఈరోజుల్లో మీకీ సందేహం కలగడం ఆశ్చర్యం కాదు. కానీ పూర్వం భారతదేశంలో ప్రతిపని చేయడానికి కొన్ని నియమాలు పెట్టారు. వారం, వర్జ్యం, తిథి ఇలా అన్ని పాటిస్తే మంచిది అని పూర్వీకులు నిర్ణయించారు. ఆచారాల్లో అంతరార్థాలు చాలా ఉంటాయి. ఒకరోజును తిథి దేవతలు, నక్షత్ర దేవతలు, గ్రహ దేవతలు పాలిస్తుంటారు. ఆయా దేవతలకు కొన్ని ప్రీతికర కర్మలు, కొన్ని అనిష్ట కర్మలు ఉంటాయి.
వాటిని గమనించిన సూక్ష్మదర్శన శక్తిగల ఋషులు ఈ ధర్మశాస్ర్తాల ద్వారా అనేక ఆచారాలను అందజేశారు. ప్రముఖ పండితుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ప్రవచన సందర్భంగా చెప్పిన శాస్త్ర విషయాలు తెలుసుకుందాం…
“ క్షౌరంభూతే రతం ధర్మే వర్జయేచ్ఛ జిజీవిషుః క్షౌరం నకుర్యాదభక్త
భుక్తస్నాత విభూషితాః ప్రయాణ సమరారంభే నరాత్రౌ న చ సంధ్యయోః
శ్రాద్దాహే ప్రతిపద్రిక్తా వ్రతాహ్ని చ నవైధృతౌ”
– వంటి నియమాలు ధర్మశాస్ర్తాల్లో చెప్పారు. వీటి అర్థం తెలుసుకుందాం…
– జన్మతిథి, చతుర్దశి , అమావాస్య , పూర్ణిమ, చవితి, షష్టి – తిథులలో క్షౌరం కూడదు.
– ప్రయాణదినాన, యుద్ధారంభాన, రాత్రిపూట, సంధ్యా సమయాలలోనూ, కజగం శ్రాద్ధ దినాలలోనూ, పాడ్యమి, శూన్య తిథులు, వ్రత దినాలలో క్షౌరం (క్షురాకర్మ) పనికిరాదు. శుక్ర, మంగళవారాలు కూడా.
– అయితే కొన్ని కర్మలకు క్షురకర్మ చేసుకుంటేగానీ పనికిరాదు – అప్పుడు తిథి వారాలను చూడరాదు.
– యజ్ఞం, ప్రేతకర్మ – మొదలైన వేళల్లో క్షౌరం, ముండనం చేయవలసిందే.
– తండ్రి కలవారు తరచుగా ముండనం (గుండు గీయించుకోవడం)చేసుకోరాదు.
“రాజకార్యనియుక్తానాం, నరాణాం భుపజీవినాం. శ్శుశ్రులోమనఖచ్ఛేదే నాస్తి కాల విశోధనమ్” రాజకార్యంలో పనిచేసేవాడు, రాజు (ప్రభుత్వం) వద్ద పనిచేసి పోషింపబడేవాడు – శ్శుశ్రుకర్మ (గెడ్డం గీసుకోవడం), గోళ్ళు తీసుకోవడం విషయంలో పెద్దగా కాలనియమం పాటించవలసిన పనిలేదు .
ఇలా చాలా విషయాలు ఈ అంశంలో చెప్పినా, కొన్ని ప్రధానమైనవి ఇక్కడ పేర్కొనడమయ్యింది .
అయితే – ఎప్పుడు క్షురకర్మ , శ్శుశ్రుకర్మ చేసుకున్నా ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే, దానికి సంబంధించిన దోషాలు పరిహరింపబడతాయి.
ఆనర్తో హిచ్ఛత్రః పాటలీ పుత్రో అదితిర్దితిః |
శ్రీశః క్షౌరౌ స్మరణాదేషాం దోషానశ్యంతి నిశ్శేషాః||
(ఆనర్తదేశం, అహిచ్ఛతము (పాము గొడుగు), పాటలీపుత్రం , అదితి, దితి, విష్ణువు – వీరిని క్షౌర (శ్శశ్రు)కాలంలో స్మరిస్తే సమస్త దోషాలు నశిస్తాయి).
వీటిపై నమ్మకం ఉంటే ఆచరించండి. లేకుంటే లేదు. కానీ ఇది పూర్వం మన పెద్దలు అందరూ పాటించినవనేది మాత్రము మరవవద్దు. వారిలాగా ఆయు, ఆరోగ్యం ఉండాలంటే వారిలాగా బతుకడానికి ప్రయత్నం మాత్రం తప్పనిసరి.
– కేశవ