ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు జగన్ పెద్దపీట వేశారు. ఊహించని విధంగా మంత్రి పదవులు అప్పగించారు. నిజానికి తమకు మంత్రి పదవులు దక్కుతాయా ? అని నోరెళ్లబెట్టిన వారు సైతం ఆశ్చర్యపోయేలా జగన్ కొందరికి మంత్రి పదవులు ఇచ్చారు. అయితే, వీరిలో ఇద్దరు మహిళా మంత్రులు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. అసలు వారు ఏం చేస్తున్నారో.. ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వారిలో సత్తా ఉందా? లేదా? అనే చర్చ కూడా తెరమీదకు వస్తోంది.
ఎస్టీ నియోజకవర్గానికి చెందిన కురుపాం నుంచి రెండు సార్లు విజయం సాధించారు పాముల పుష్ప శ్రీవాణి. వైఎస్‌పై అభిమానంతో ఆమె ఏకంగా తన చేతిపై వైఎస్సార్ పచ్చబొట్టును కూడా వేయించుకున్నారు. పార్టీ కోసం ఏమైనా చేసేందుకు వెనుకాడని నాయకురాలిగా కూడా పేరుతెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే జగన్ అభిమానం సొంతం చేసుకున్నారు. దీంతో ఆయన పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవిని అప్పగించి గిరిజన సంక్షేమ శాఖను అప్పగించారు.
అయితే, మంత్రి అయినా.. కూడా ఆమె ఏం చేస్తున్నారో తెలియడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నత విద్యావంతురాలు, అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్న నాయకురాలు కావడంతో వివాదాలకు కూడా దూరంగా ఉన్నారు. కానీ, ఆమె ఏం చేస్తున్నారో తెలియడం లేదు. మరో మంత్రి, డిప్యూటీ సీఎం తానేటి వనిత కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి విజయం సాధించిన ఆమె జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. కానీ, ఏం చేస్తున్నారో తెలియడం లేదు.
అయితే, తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం సీనియర్ మంత్రులు కొందరు వీరిని కట్టడి చేస్తున్నారని సమాచారం. మీరు జూనియర్లు ఇంకానేర్చుకోవాల్సింది చాలా ఉంది.. అంటూ సీనియర్లు చేస్తున్న వ్యాఖ్యలతో వీరు తమ మెదడుకు పదును పెట్టడం లేదని అంటున్నారు. దీంతో వీరు వెనుకబడి పోతున్నారని తెలుస్తోంది. మరి జగన్ జోక్యం చేసుకుని వీరి పరిస్థితిని సరిదిద్దాల్సినఅవసరం ఉందని అంటున్నారు. మరి ఏం జరగుతుందో చూడాలి.