టిమ్ బెర్నర్స్ లీ అందుబాటులోకి తెచ్చిన వరల్డ్ వైడ్ వెబ్ నేటితో సరిగ్గా 30 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే గూగుల్ ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ తన సెర్చ్ సైట్‌లో వరల్డ్ వైడ్ వెబ్ డూడుల్ ను కూడా ఇవాళ ఉంచింది.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ మీద ఆధారపడే నడుస్తోంది. ఇంటర్నెట్ లేని ఈ ప్రపంచాన్ని మనం ఒక్క సెకను కూడా ఊహించలేం. అంతగా అది మన జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఇంటర్నెట్ మీద ఆధార పడి నేడు ఎంతో మంది ఉపాధి పొందుతుండగా, ప్రజలకు ఎన్నో కష్టతరమైన సేవలు సులభంగా ఇంటర్నెట్ ద్వారా లభిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు మనకు ఒక విజ్ఞాన భాండాగారం గానే కాదు, వినోదాన్ని అందించే మాధ్యమంగా, సేవలను చేసిపెట్టే సాధనంగా కూడా ఉపయోగపడుతోంది.
అయితే ప్రస్తుతం మనం విరివిగా ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకుంటున్నాం కానీ.. అసలు ఆ సేవలకు ఆద్యులు ఎవరు ? అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. 1989 మార్చి 12వ తేదీన టిమ్ బెర్నర్స్ లీ అనే వ్యక్తి వరల్డ్ వైడ్ వెబ్‌ను తొలిసారిగా డెవలప్ చేశారు. ఆ తరువాత దానికి అనేక మార్పులు, చేర్పులు జరిగాయి. ఈ క్రమంలో ప్రజలకు 1993 ఏప్రిల్ నెలలో తొలిసారిగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. అలా ఇంటర్నెట్ దిన దిన ప్రవర్థమానం అన్నట్లుగా విస్తృతమైంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది ఇంటర్నెట్ సేవలను పొందుతున్నారు.
అలా టిమ్ బెర్నర్స్ లీ అందుబాటులోకి తెచ్చిన వరల్డ్ వైడ్ వెబ్ నేటితో సరిగ్గా 30 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే గూగుల్ ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ తన సెర్చ్ సైట్‌లో వరల్డ్ వైడ్ వెబ్ డూడుల్ ను కూడా ఇవాళ ఉంచింది. ఏది ఏమైనా.. ఇంటర్నెట్ అనేది ప్రస్తుతం మన జీవితాలను చాలా ప్రభావితం చేస్తోంది. అయితే ఇంటర్నెట్ వాడకం మాట ఎలా ఉన్నప్పటికీ ఇంటర్నెట్ యూజర్లు మాత్రం ఆ ప్రపంచంలో తమ డేటా పట్ల చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!