ఏపీలో ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే అధికార వైసీపీ ఈ ఏడు స్థానాలని ఏకగ్రీవంగా గెలుచుకునేందుకు చూస్తుంది. పూర్తి బలం ఉండటంతో గెలిచేస్తామనే ధీమాతో ఉంది. ఇదే సమయంలో ప్రతిపక్ష టిడిపి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..తమ పార్టీ తరుపున ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధని బరిలో దింపారు. తాజాగా ఆమె నామినేషన్ వేశారు.
చంద్రబాబు, లోకేష్ తనను అభ్యర్ధిగా నిలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే అనురాధ పార్టీకి, రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని, టీడీపీకి 23 సభ్యుల బలం ఉందని.. తమకు 22 మంది ఉంటే సరిపోతుందని, అనురాధ తప్పకుండా గెలుస్తారని టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు సైతం నామినేషన్ వేశారు.
వైసీపీ తరుపున పెనుమత్స సురేష్ , కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకట రమణ , పోతుల సునీత, చంద్రగిరి యేసు రత్నం అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు వేశారు. అయితే ఇందులో 6 స్థానాలు వైసీపీ సులువు గానే గెలిచేస్తుంది..కానీ 7 స్థానం కోసం టిడిపితో పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. అయితే వైసీపీ బలం 151..అదే సమయంలో టిడిపి నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన ఒక ఎమ్మెల్యే సైతం వైసీపీకే మద్ధతు ఇస్తున్నారు. అంటే 156 అవుతుంది. అప్పుడు 7 గెలవడం సులువే. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది..వైసీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి బయటకొచ్చారు..అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారని, వారు టిడిపికి మద్ధతు ఇస్తారని ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే వైసీపీకి షాక్ తప్పదు.
ఒకవేళ వైసీపీ 7 స్థానాలు గెలిచినా సరే..టిడిపి రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటు వేస్తే..అప్పుడు టిడిపి జారీ చేసే విప్ ధిక్కరిస్తే రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశాలు ఉంటాయి. అటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పరిస్తితి అంతే.