పొలంలో కలుపుతీస్తుండగా దొరికిన వజ్రం..యూటర్న్‌ తిరిగిన రైతు జీవితం..! 

-

కాలం కలిసొస్తే..జీవితం ఎంత అధ్వానంగా ఉన్నా..యూటర్న్‌ తీసుకోవాల్సిందే.. అదే కాలం చిన్నచూపు చూసిందంటే..ఎంత కష్టపడినా నష్టపోక తప్పదు. సాధారణంగా రైతుల జీవితం ఆకాశంలో దీపం పెట్టి కాపాడు దేవుడా అన్నట్లే ఉంటుంది. నానా కష్టాలు పడి పంట పండిస్తారు. కానీ అది చేతికొచ్చే సరికి వానలు వచ్చి కొట్టకుపోవడమో..లేక మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక రవాణా చార్జీలు కూడా మిగలక చెమటోడ్చి పండించిన పంటను నేలపాలు చేయడమే జరుగుతుంది. ఖర్చు వేలల్లో ఉంటే ప్రభుత్వాలు ఇచ్చే సాయం అందులో ఒకటో వంతు కూడా ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భూదేవతే..కరుణిస్తే..ఇక ఏం కష్టపడతావ్‌లే ఈ వజ్రం తీసుకో అన్నట్లు.. పొలంలో ఆ రైతుకు వజ్రం దొరికింది. ధర లక్షల్లో పలికిందట.. ఇది జరిగింది ఎక్కడో కాదు.. మన కర్నూలు జిల్లాలోనే..!
లచ్చిందేవికి ఓ లెక్క ఉంటుంది. ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. వచ్చి మన లెక్కంతా సెట్ చేసేస్తుంది. అలాంటి అద్భుతమే ఓ పేద రైతు కుటుంబంలో జరిగింది. ఒక్క వజ్రం తమ జీవితాలను మార్చేసింది. ఇంతకీ ఈ విషయం జరిగింది ఎక్కడా అనుకుంటున్నారా? మన ఏపీలోని కర్నూలు జిల్లాలోనే. వేసిన పంటకు ధర రాలేదని బాధపడుతున్న ఆ రైతు కుటుంబాన్ని లక్ష్మీదేవి పలకరించింది. పొలంలో కలుపు తీస్తుండగా లక్షల విలువ చేసే వజ్రం దొరికింది.
కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం అక్కడి ప్రజలు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. కానీ లక్‌ కొందరికే ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ నిద్రాహారాలు లేకుండా పొలాల్లో వజ్రాల కోసం ఒడిసిపడతారు. తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు కుమార్తె టామాటా తోటలో కలుపు తీస్తోంది. ప్రకాశవంతంగా మెరుస్తున్న రాయి కనిపించింది. వెంటనే వెళ్లి తీసుకుంది. విషయాన్ని ఇంట్లో చెప్పింది. అప్పటికే ఆ ప్రదేశంలో వజ్రాల వేట చేస్తారని ఆ కుటుంబానికి బాగా తెలుసు. అంతే ఇక ఇది వజ్రమేనని కన్ఫామ్ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వ్యాపారులు రైతుతో మాట్లాడారు. సిండికేట్‌గా ఏర్పడి.. వజ్రాన్ని ఏకంగా రూ.34 లక్షలు, 10 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.
మొత్తానికి అలా వజ్రం తెచ్చిన అదృష్టం..రైతు కష్టాలను గట్టెక్కించింది.!

Read more RELATED
Recommended to you

Latest news