ఐపీఎల్: డూ ఆర్‌ డై మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ రెడీ…!

ఐపీఎల్‌ 2020లో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఇవాళ జరగనుంది. ముంబై ఇండియన్స్‌తో డూ ఆర్‌ డై మ్యాచ్‌కు రెడీ అయింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. గత రెండు మ్యాచ్‌ల్లో పటిష్టమైన ఢిల్లీ, బెంగళూరు జట్లపై సాధించిన విజయాలతో ఆత్మవిశ్వాసం రెండింతలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఐపీఎల్‌లో అత్యంత కీలకమైన పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్‌ బెర్త్‌కోసం బలమైన ముంబై జట్టుతో తాడోపేడో తేల్చుకోనుంది. టోర్నీలో ముంబై తర్వాత అత్యంత మెరుగైన రన్‌రేట్‌ ఉన్న హైదరాబాద్‌..ఈ మ్యాచ్‌లో గెలిస్తే టాప్‌ ఫోర్‌లోకి అడుగుపెట్టనుంది.

అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లో అదరగొడుతున్న హైదరాబాద్‌..అదే ప్రదర్శనను రీపిట్‌ చేయాలని భావిస్తోంది. షార్జా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలిస్తే..మెరుగైన నెట్ రన్ రేట్‌తో పాయింట్స్‌ టేబుల్‌లో మూడో స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం సన్‌రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. మరోవైపు 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా.. ముంబై పాయింట్ల పట్టికలో తొలిస్థానంలోనే ఉంటుంది. మిగతా జట్లన్నీ ఓడుతూ, గెలుస్తూ.. లీగ్ దశను ముగించగా.. ఒక్క ముంబై మాత్రమే తేలిగ్గా ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.