కేటుగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇటీవల కరెంట్ బిల్లుల పేరుతో కొందరిని బురడీ కొట్టించిన విషయం తెలిసిందే. అయితే ఓ డాక్టర్‌కు అమ్మాయిలు అంటే వ్యసనంగా ఉండటంతో.. అది గుర్తించిన సైబర్ కేటుగాళ్లు అతడికి అమ్మాయిల ఫోటోలను పంపి రెచ్చగొట్టారు. అమ్మాయిలను నీ దగ్గరకు పంపిస్తామంటూ.. సదరు డాక్టర్ నుంచి పలు దఫాలుగా రూ.1.5 కోట్ల వరకు స్వాహా చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ డాక్టర్ పలు డేటింగ్ సైట్లు, యాప్ లను సెర్చ్ చేయడాన్ని గుర్తించిన సైబర్ నేరగాళ్లు.. ఓ అమ్మాయిని ఎరగా వేసి ఆ డాక్టర్ ను ముగ్గులోకి లాగారు. అందమైన యువతిని పంపిస్తామంటూ ఆ డాక్టర్ ను ప్రలోభానికి గురిచేసి పలు దఫాలుగా రూ.40 లక్షల వరకు దండుకున్నారు. అయితే.. దీనిపై ఆ డాక్టర్ నిజాన్ని గ్రహించి 2020లోనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆ వైద్యుడు సదరు అందమైన అమ్మాయి కోసం మరో రెండు దఫాలుగా నగదును నిందితుల ఖాతాల్లో వేశాడు సదరు డాక్టర్. ఆ విధంగా మొత్తం రూ.80 లక్షలు నగదు బదిలీ చేశాడు డాక్టర్. దీనిపై పోలీసులు ఆ డాక్టర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చినా నిష్ప్రయోజనం అయింది. కుటుంబ సభ్యులు అతడి బ్యాంకు ఖాతాలు పరిశీలించగా, మూడేళ్ల కాలంలో మొత్తం రూ.1.5 కోట్లు గల్లంతైనట్టు వెల్లడైంది. కాగా, ఆ నగదు ఏ బ్యాంకు ఖాతాకు బదిలీ అయిందో గుర్తించారు పోలీసులు. ఈ మేరకు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.