కుక్కలకు ఎంత విశ్వాసం ఉంటుందో.. మనందరికి తెలుసు..అవి ప్రేమించడం మొదలుపెట్టాయంటే.. మీరు వద్దన్నా ఆపవు. ఒక అధ్యయనం ప్రకారం.. కుక్కలు యజమాని ఏ మూడ్‌లో ఉన్నాడో కూడా కనిపెట్టగలవు అని తేలింది. అంటే మనం సాడ్‌గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా అవి గ్రహించగలవట..మ్యాటర్ ఏంటంటే.. కుక్కతో కలిసి అడివిలో వెళ్తున్న ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. చుట్టూ ఎవరూ లేరు.. కుక్క మాత్రమే ఉంది. దానికి అర్థమైంది.. యజమానికి ఏదో అయిందని..సాయం చేసింది. ఆ వ్యక్తి ప్రాణాలు కాపడగలిగింది.. ఎలా అంటారా..?
హోసానగర్ తాలూకాలోని సూడూరు గ్రామానికి చెందిన శేఖరప్ప ప్రతిరోజూ సమీపంలోని అడవికి కట్టెల కోసం వెళ్తుంటారు. రోజూ ఉదయం 6 గంటలకు తన ఇంటి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవికి వెళ్లి ఉదయం 10 గంటలకు తిరిగి వస్తారు. ఆ తర్వాత ఆయనూరు పట్టణంలోని హోటల్‌లో పనికి వెళ్తాడు.
అయితే ఎప్పటిలాగే అడవికి వెళ్లిన శేఖరప్ప, శనివారం మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో అతని భార్య, కుమార్తె ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. అతడు కట్టెల కోసం వెళ్లిన అటవీప్రాంతంలో 50 మందికి పైగా గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటలపాటు వెతికినా వారికి శేఖరప్ప కనిపించలేదు. అప్పుడే బాధితుడి కుటుంబం పెంచుకుంటున్న నల్ల కుక్క టామీ రంగంలోకి దిగింది అడవిలో అది అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కొంతసేపటికి సుదూర ప్రాంతంలో గట్టిగా మొరుగుతూ కనిపించింది. అది విన్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో.. ఓ చెట్టు కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న శేఖరప్ప కనిపించాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. శేఖరప్పను కాపాడటంలో టామీ చేసిన సాయంపై అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
తన చివరి శ్వాస వరకు టామీని జాగ్రత్తగా చూసుకుంటానని శేఖరప్ప చెప్పారు. ఎవరో వదిలేసిన ఆడ కుక్కకు ఏడేళ్ల క్రితం ఆశ్రయం కల్పించామని, టామీ అని పేరుపెట్టుకున్నామని చెప్పారు. శేఖరప్ప రోజూ అడవిలో వెళ్లే మార్గం కుక్కకు తెలుసని సూడూరు గ్రామానికి చెందిన శివన్న చెప్పాడు. టామీ సాయంతో శేఖరప్పను త్వరగా కనిపెట్టామని తెలిపాడు.