కేసీఆర్ జాతీయ స్థాయిలో ఎంత బీజేపీని టార్గెట్ చేసిన సరే..రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ గ్రాఫ్ పెద్దగా పెరిగేలా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి మూడో సారి అధికారంలోకి రావాలని కేసీఆర్ ట్రై చేస్తున్నారు. కానీ గత ఎన్నికల మాదిరిగా కేసీఆర్‌కు ఇప్పుడు ఒక శత్రువు కావాలి. అందుకే కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రజల్లో బీజేపీని నెగిటివ్ చేసి..టీఆర్ఎస్‌ని గెలిపించుకోవాలని చూస్తున్నారు.
అయితే ప్రతిసారి తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌కు పడిపోవడం అనేది జరిగే ఛాన్స్ కనిపించడం లేదు. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. పైగా చాలామంది టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదుర్కుంటున్నారు. చాలా చోట్ల సగానికి సగం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్తితి పెద్దగా బాగోలేదు. ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పరిస్తితి అంతగా బాగోలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ బలపడుతున్నట్లు పలు సర్వేల్లో తేలింది. అటు బీజేపీ కూడా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది.
అసలు ఇక్కడ పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్దగా పాజిటివ్ లేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 12 స్థానాల్లో టీఆర్ఎస్ 10 గెలుచుకుంది. కాంగ్రెస్ రెండుచోట్ల గెలిచింది. భూపాలపల్లిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్ లోకి వచ్చారు. దీంతో కాంగ్రెస్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క మిగిలారు. అంటే టీఆర్ఎస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇక ఈ 11 మందిలో పాజిటివ్ ఉంది..కేవలం నలుగురు ఎమ్మెల్యేలకు అని తెలుస్తోంది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, వరంగల్ వెస్ట్‌లో దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేటలో ఆరూరి రమేశ్, డోర్నకల్‌లో రెడ్యానాయక్‌లకు మాత్రమే మళ్ళీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. మిగిలిన ఎమ్మెల్యేలు గట్టి పోటీ ఎదురుకోవాల్సిన పరిస్తితి ఉందని తెలుస్తోంది. పైగా జిల్లాలో ఐదారు స్థానాల్లో కాంగ్రెస్ పుంజుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వరంగల్ లో కారుకు గట్టి డ్యామేజ్ జరిగేలా ఉంది.