దేశంలో ఎక్కడికిపోయిన ఆధార్ తప్పనిసరైంది. అయితే ఆధార్ సేవలను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం సచివాలయాల్లో ఆధార్ సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిసారి ఆధార్ వివరాలు నమోదు చేసుకునే వారికి పూర్తి ఉచితంగా సేవలు అందజేస్తారని ఆ శాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకునే వారికి కూడా ఒకసారి ఉచిత సేవలు అందిస్తారని వెల్లడించింది. అయితే, ఆధార్ కలర్ ప్రింట్, బయోమెట్రిక్‌లో తప్పులు సరిదిద్దడం, అడ్రసు తదితర వివరాల్లో మార్పులకు ఆధార్ నమోదు సంస్థ(యూఐడీఏఐ) నిర్ధారించిన సర్వీసు చార్జి ఉంటుందని పేర్కొంది.
సచివాలయాల్లో ఆధార్ సేవలు నిర్వహణకు సంబంధించి విధివిధానాలపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ షాన్‌మోహన్ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల సచివాలయాల్లో ఈ ఆధార్ సేవా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు షాన్ మోహన్ ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. ప్రతి ఐదు సచివాలయాల్లో ఒకటి చొప్పున, సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలు, వార్డుల వారికి సమాన దూరంలో ఉండేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.