కార్పొరేట్ కళాశాలలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల ముందు ధర్నాకు దిగినట్లు తెలిపారు. నారాయణగూడలో శ్రీచైతన్య జూనియర్ కళాశాల వద్ద ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలు ప్రభుత్వం నియంత్రించడం లేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న, అనుమతి లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి ర్యాంకులను ప్రచారం చేస్తున్న కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని ప్రవీణ్ రెడ్డి కోరారు. ఒకే పేరుతో వందల బ్రాంచ్లు నిర్వహిస్తూ.. అధిక ఫీజులు వసూల్ చేస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ విద్యలో కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు, ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్పొరేటర్ విద్యాసంస్థలను నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఇంటర్ విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు.