జెన్‌కో బొగ్గు కొనుగోలు టెండర్ల ప్రక్రియ నుంచి అదానీ గ్రూప్స్ తప్పుకుంది. గతంలో జారీ చేసిన మూడు టెండరు ప్రకటనల్లో కీలకంగా వ్యవహరించిన అదానీ సంస్థ తప్పుకోవడంతో.. ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్, చెట్టినాడు సంస్థలు పోటీ బిడ్‌లు దాఖలు చేశాయి. రాష్ట్ర విద్యుత్ అభివృద్ధి కంపెనీ (ఏపీపీడీసీఎల్) పిలిచిన టెండరుకు చెట్టినాడు ఒక్కటే బిడ్ వేసింది.
31 లక్షల టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోడానికి జెన్‌కో రెండు వేర్వేరు టెండరు ప్రకటనలు జారీ చేసింది. సాంకేతిక బిడ్‌లను అధికారులు శుక్రవారం తెరిచారు. ప్రైస్ బిడ్‌ను సోమవారం తెరవనున్నట్లు జెన్‌కో ఎండీ శ్రీధర్ తెలిపారు. జెన్‌కో థర్మల్ యూనిట్లకు 18 లక్షలు, కృష్ణపట్నం థర్మల్ యూనిట్‌కు 13 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలుకు జెన్‌కో నిర్ణయించింది. ఈసారి ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్ కొత్తగా పోటీలోకి రావడం గమనార్హం.