నాలుగు అడుగులు వెనక్కి వేసిన పులి ఒక్కసారిగా ముందుకు దూకి కొట్టే పంజా దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో… అలా వరుస ఫ్లాప్‌ల తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకొని, ఓ భారీ హిట్ కొట్టింది అదితి పోహన్‌కర్.
కేవలం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘షీ’ వెబ్ సిరీస్‌లోనే కాదు, నిజ జీవితంలోనూ ఆమె ఓ సివంగి. ముంబైలో పుట్టి,పెరిగింది. బహుముఖప్రజ్ఞగల కుటుంబం ఆమెది. తండ్రి సుధీర్ పోహన్‌కర్ మారథాన్ రన్నర్, తల్లి శోభా పోహన్‌కర్ జాతీయ స్థాయి హాకీ ప్లేయర్.
అమ్మమ్మ సుశీల శాస్త్రీయ సంగీత గాయని. అక్క నివేదిత రచయిత్రి, ఆమె బావ బాలీవుడ్ ప్రసిద్ధ నటుడు మకరంద్ దేశ్‌పాండే. ఆ ప్రతిభా వారసత్వాన్ని అందిపుచ్చుకుంది అదితి.
చిన్నతనంలో పరుగు పొటీల్లో పాల్గొని ఎన్నో మెడల్స్ సాధించింది. మహారాష్ట్ర తరపున 100, 200 మీటర్ల పరుగు పందేలు, మారథాన్‌లలో పాల్గొంది. ముంబై విశ్వవిద్యాలయంలో కామర్స్ కోర్సు చేసింది.
కాలేజీ రోజుల్లోనే నటనపై ఉన్న ఇష్టంతో ప్రఖ్యాత నాటక దర్శకుడు సత్యదేవ్ దూబే వర్క్‌షాపుల్లో పాల్గొనేది. అక్కడే ఆమె ఆల్‌రౌండర్‌గా మారింది.. నటిగా, సింగర్‌గా, డాన్సర్‌గా!
ఇది గుర్తించిన ఆమె బావ, సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. అలా 2010లో ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేనంత బిజీ అయిపోయింది.
వెంట వెంటనే ‘కుణాసాఠీ కుణీతరి’ మరాఠి చిత్రం, ‘జెమినీ గణేశనం సురులి రాజానం’, ‘మన్నవన్ వన్యనాది’ తమిళ చిత్రాల్లో నటించింది. కానీ అవన్నీ ఫ్లాప్‌లే. 2014లో చేసిన ‘లయ్‌భరి’ మరాఠి చిత్రం బాగా ఆడింది. అయితే రితిశ్ దేశ్‌ముఖ్‌కు మొదటి సినిమా కావడంతో క్రెడిట్ మొత్తం అతనికి వెళ్లింది.