ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో కొంతమంది నేతలు పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నాయని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అయితే కొంతమంది నేతల విషయంలో బీజేపీ అగ్రనేతలు సీరియస్గా ఉన్నారు అని కూడా అంటున్నారు. కొంతమంది నేతలు పార్టీ కోసం పని చేయకపోవడంతో పార్టీ దారుణంగా ఇబ్బంది పడుతుంది. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పని తీరుపై బీజేపీ అగ్రనేతలు చాలా సీరియస్ గా ఉన్నారని సమాచారం.
ఆయన పార్టీలో ఉన్నా పార్టీ కోసం పెద్దగా కష్ట పడటం లేదని మండిపడుతున్నారు. దీని వలన సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. అంతే కాకుండా కొంత మంది నేతలను కలుపుకుని వెళ్లే విషయంలో ఆయన ఇబ్బంది పడుతున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి కన్నా లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.
వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా తో పాటుగా కొన్ని జిల్లాల్లో ప్రభావం చూపించగలిగే నేత. ఆయనకు చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపిక చేస్తే తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలను కూడా బీజేపీ లోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆయన విషయంలో బీజేపీ అధిష్టానం సానుకూలంగా ఉందని త్వరలోనే ఆయన పేరును ప్రకటించే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు.