2008 అహ్మదాబాద్ వరస బాంబు పేలుళ్ల కేసులో స్పషల్ కోర్ట్ సంచలన తీర్పును వెల్లడించింది. దాదాపు 14 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. మొత్తం 49 మంది దోషుల్లో 38 మందికి మరణ శిక్ష, మరో 11 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్ట్ కీలక తీర్పు చెప్పింది. జూలై 26, 2008లో ఈ వరస బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. మొత్తం 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల వరసపేలుళ్లు జరిగాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) ఈ ఘటనకు పాల్పడింది. మొత్తం 77 మంది నిందితులపై విచారణ జరిపింది సిట్. ఇందులో ఒకరు అప్రూవర్ గా మారడంతో పూర్తి సాక్ష్యాలు సేకరించడం సాధ్యం అయింది.
నిషేధిత ఇండియన్ ముజాహిద్దిన్ ఉగ్రవాద సంస్థ 2008లో అహ్మదాబాద్ నగరంలో మారణహోమం సృష్టించింది. వరసగా బాంబు పేలుళ్ల ఘటనకు పాల్పడింది. రద్దీగా ఉంటే ప్రాంతాల్లో, స్కైవేలతో, బస్ స్టేషన్లలో బాంబులు అమర్చారు. సాధారణ ప్రజలే లక్ష్యంగా పేలుళ్లు జరిపారు. ఈ పేలుళ్లు అప్పుడు దేశంలో పాటు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. కొన్ని చోట్ల ముందుగానే బాంబులను గుర్తించి భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. లేకపోతే మరింతగా విధ్వంసం చెలరేగేది. మొత్తం 18 చోట్ల బాంబులను అమర్చారు ముష్కరులు. ఈ బాంబు పేలుళ్ల ఘటనలో 56 మంది మరణించగా.. 200 మంది దాకా గాయాలపాలయ్యారు.
2002లో జరిగిన గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా ఐఎం ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు కుట్ర పన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లో అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలోని ట్రామా కేర్ సెంటర్ కూడా ఉంది. ఈ సంఘటనలో మైనార్టీ సమాజానికి చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస పేలుళ్ల తరువాత సూరత్‌లో అనేక ప్రాంతాల నుంచి పోలీసులు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్‌లో 20, సూరత్‌లో 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.