తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నేడు చేవెళ్ల కేవీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. భారత్ మాతా కీ జై అంటూ.. చిలుకూరు బాలాజీ ఆశీర్వాదంతో మాట్లాడుతున్నానని ప్రసంగాన్ని ప్రారంభించారు.
బీఆర్ఎస్ అవినీతి పాలనను, కేసీఆర్ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 9 ఏళ్లుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలా వద్దా? అని అన్నారు. ఢిల్లీలో ఉన్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి వినిపించేలా నినాదాలు చేయాలని పిలుపునిచ్చారు.
పేపర్ లీక్ పై ప్రశ్నించిన బండి సంజయ్ ని జైల్లో పెట్టారని, కానీ 24 గంటల్లోనే బెయిల్ వచ్చిందని అమిత్ షా తెలిపారు. బండి సంజయ్ ఏం తప్పు చేశారని నిలదీశారు. బీజేపీ కార్యకర్తలు ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడబోరని స్పష్టం చేశారు.
కేసీఆర్ అసెంబ్లీలో తమ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను మాట్లాడనివ్వడంలేదని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మోదీ నుంచి ప్రజలను దూరం చేయలేరని అమిత్ షా స్పష్టం చేశారు.