రాజధాని అమరావతి తరలిపోతోందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. వాస్తవానికి అధికార వైఎస్సార్ సీపీ మాత్రం ఇక్కడ శాసన రాజధాని ఉంటుందని, ఇక్కడే విద్యారాజధానిని అభివృద్ధి చేస్తామని.. అదేవిధంగా రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను, చేసుకున్న ఒప్పందాలను కూడా నెరవేరుస్తామని చెబుతోంది. కానీ, చంద్రబాబు మాత్రం అమరావతిని కొనసాగించి తీరాలని పట్టుబడుతున్నారు. కానీ, ఆయన జగన్‌ను నిలువరించలేక పోతున్నారు. అదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతికి వ్యతిరేకత ఉందని చెబుతున్నా.. తన సొంత పార్టీ నేతలతోనే ఉద్యమాలు చేయించలేక పోతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ అమరావతి ఎఫెక్ట్ టీడీపీపై ఎక్కువగా ఉంటుందా? లేక వైఎస్సార్ సీపీపై ఎక్కువగా ఉంటుందా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. ఈ క్రమంలో టీడీపీపైనే ఎక్కువగా ఉంటుందని అనేవారు కనిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. అమరావతి ప్రాంతం అంటే.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు సమీపంలో ఉంది. దీనిని నిలబెట్టుకోలేక పోతున్న చంద్రబాబుపై ఈ మూడు జిల్లాల్లో వ్యతిరేకత వస్తుంది. అదేసమయంలో తప్పు చేశారు కాబట్టే తరలిస్తున్నాం .. అన్న వైఎస్సార్ సీపీ నేతల వ్యాఖ్యలను ఈ మూడు జిల్లాల ప్రజలు విశ్వసించాల్సి వస్తుంది. దీంతో బాబు ఇమేజ్ ఈ మూడు జిల్లాల్లోనూ పడిపోతుంది.
పోనీ.. మిగిలిన జిల్లాల్లో అయినా బాబుకు మార్కులు పడతాయా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. మాకు న్యాయరాజధాని వస్తే.. అడ్డుకున్నారన్న ఆవేదన సీమ ప్రాంత వాసుల్లో కనిపిస్తోంది. ఇక, ఉత్తరాంధ్రలోనూ పాలన రాజధానిని అడ్డుకుంటున్నది చంద్రబాబేనని వైఎస్సార్ సీపీ చేస్తున్న ప్రచారం దాదాపు ప్రజల్లోకి వెళ్లింది. రేపు అక్కడ పాలనా రాజధాని ఏర్పడినా.. నేనే తీసుకువచ్చాను అని చంద్రబాబు చెప్పుకోలేదు. పోనీ.. అమరావతిలో లేకపోతే.. ఉద్యమం చేయలేక, తన కన్నా చిన్నవాడైన జగన్‌ను ఎదిరించలేక పోయారనే అపప్రదను మూటగట్టుకుంటారు. ఫలితంగా అమరావతి ఎఫెక్ట్ చంద్రబాబుపై సీరియస్‌గా ఉంటుంది.
ఇక, వైఎస్సార్ సీపీ విషయానికి వస్తే.. మూడు జిల్లాల్లోనే ఈ పార్టీపై వ్యతిరేకత కనిపించేఅవకాశం ఉటుందని అంటున్నారు. అమరావతిని శాసన రాజధానిగా చేసినా.. పూర్తిస్థాయిలో రాజధానిని తరలించారనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక, మిగిలిన సీమ, ఉత్తరాంధ్రల్లో మాత్రం వైఎస్సార్ సీపీకి మంచి మార్కులు పడనున్నాయి. మాకు రాజధానులు తెచ్చి, అభివృద్ధి చేశారనే క్రెడిట్ పూర్తిగా జగన్‌కే ఇక్కడి ప్రజలు ఇస్తారు. ఇలా అటు టీడీపీ 13 జిల్లాల్లోనూ ప్రాభవం కోల్పోతుండగా.. వైఎస్సార్ సీపీ మహా అయితే…. మూడు జిల్లాల్లోనే దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.