పల్నాడు జిల్లాలో వృద్ధురాలిపై అత్యాచారం

సమాజంలో రోజు ఎక్కడో ఓ చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వయసు, లింగ బేధం చూడకుండా కర్కశంగా వ్యవహరిస్తున్నారు కామాంధులు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి పల్నాడు జిల్లా రొంపిచర్లలో చోటుచేసుకుంది. 65 ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు ఓ నిందితుడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. మండలంలోని విప్పర్లకు చెందిన వృద్ధురాలు ఇంటి ముందు ఆరు బయట నిద్రించింది. శనివారం ఉదయం పొద్దెక్కిన లేవకపోవడంతో ఆ వృద్ధురాలని లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె శరీరంపై గాయాలు ఉండడంతో పాటు దుస్తులు తొలగించి ఉండడంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానించారు. డాగ్ స్క్వాడ్ తో గాలింపు చేపట్టగా.. శునకాలు సమీపంలో ఉన్న పెరవలి మణికంఠ ఇంట్లోకి వెళ్లడంతో అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. దీంతో తానే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.