ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి రెండు, మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరడం హాస్యాస్పదంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. రెండు, మూడు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తే దొంగ ఓట్లు వేయడం సులభతరం అవుతుందని ఆయన భావించి ఉంటారని తమిళనాడు నుంచి కుప్పంకు అరువు జనాలను, కోస్తాంధ్రకు నెల్లూరు, ఒంగోలు ప్రాంతానికి రాయలసీమ బ్యాచ్ ను సులభంగా తరలించవచ్చుననేది ఆయన ఉద్దేశమై ఉంటుందన్నారు.
ఎన్ని ఓట్లు పడినా పడినట్లే లెక్క అని భావించి ఉంటారని, ఇటువంటి కుట్రలపై ఆధారపడే పోటాపోటీగా ఉన్న స్థానాలలో నెగ్గ వచ్చునని అనుకుంటున్నారని, అందుకే కొంత మంది అభ్యర్థులు అడిగినంత కాకపోయినా ఎంతోకొంత వైకాపా నాయకత్వానికి అడ్వాన్సులు ముట్ట చెబుతున్నారని అన్నారు. టీడీపీలో టికెట్ల కోసం చేరే పరిస్థితి లేదని, అక్కడే హౌస్ ఫుల్ బోర్డు పెట్టారన్నారు. ఇక చేసేది లేక ఆశావాహులు వైకాపా నాయకత్వానికి అడిగినంత కాకపోయినా ఎంతో కొంత నగదు ముట్ట చెబుతున్నట్లు తెలిసిందన్నారు. పోలీసులు, గుండాలు, వాలంటీర్ల సహకారంతో దొంగ ఓట్లు వేయించుకొని ఎన్నికల్లో గెలవాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ప్లాన్ అని రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు.