మెజారిటీ మైనస్: జగనే పెద్ద ప్లస్… !

ఏపీ చరిత్రలో అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్…మంచి సంక్షేమ పాలనతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. తాను అధికార పీఠంలోకి వచ్చిన దగ్గర నుంచి మేనిఫెస్టోలోని హామీలని అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో దాదాపు 80 శాతం పైగా హామీలు అమలు చేసి ప్రజల మద్ధతు పొందుతున్నారు. అందుకే ఇటీవల ఓ సర్వేలో కూడా ఇంకా ప్రజలు జగన్ వైపే ఉన్నారని తెలిసింది. అలా అని 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతంలో పెద్ద మార్పులు రాలేదు.  అప్పుడు కంటే ఇప్పుడు ఓ రెండు శాతం ఎక్కువగా ప్రజల మద్ధతు కూడగట్టుకున్నారు.


అయితే కేవలం సీఎం జగన్ ఇమేజ్ వలనే ప్రజలు ఇంకా వైసీపీకి సపోర్ట్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు అంతగా బాగోలేదనే చెప్పొచ్చు. ఎమ్మెల్యేల పరంగా పార్టీకి వచ్చే లాభం ఏమి లేదని అర్ధమవుతోంది. వైసీపీకి 151 ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. ఇక టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు ఐదు మంది జగన్‌కు జై కొట్టారు. ఇక ఈ మొత్తంలో మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీకి మైనస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అసలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనబరుస్తున్న దాఖలాలు లేవు.

పైగా ఆయా నియోజకవర్గాల్లో అవినీతి, అక్రమాలు ఎక్కువగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేల అనుచరులు దందాలు, ఇళ్ల పట్టాల్లో అక్రమాలు, అక్రమ మైనింగ్, పలు కాంట్రాక్టుల్లో అవినీతి, ఇలా చెప్పుకుంటూ పోతే పలు అంశాలు ఎమ్మెల్యేలకు మైనస్ అవుతున్నాయి. వీటికి తోడు నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడంలో పలువురు ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. దీంతో ప్రజలు ఎమ్మెల్యేల పట్ల సంతృప్తిగా లేరని తెలుస్తోంది. వారు కేవలం జగన్ పథకాల వలనే వైసీపీకి మద్ధతు తెలుపుతున్నారు. ఇప్పటికీ జగన్ ఇమేజ్ పార్టీని రక్షిస్తుంది.

 

-vuyyuru subhash