ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. దసరా పండుగ సమయంలో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 4,485 దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది. నవరాత్రుల సందర్భంగా దసరాకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు 2,385 ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది.
అలాగే దసరా అనంతరం తిరుగు ప్రయాణం కోసం 2,385 ప్రత్యేక బస్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అత్యధికంగా హైదరాబాద్ కు 2,290 బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది ఆర్టీసీ. అంటే మొత్తం 4,485 బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఈ బస్సుల్లో కూడా మామూలు చార్జీలే వసూలు చేస్తారు. మరోవైపు ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. ఈనెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు విజయవాడ దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి విజయవాడ కు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు.