ఏపీలో పార్టీల పొత్తులపై మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, టీడీపీ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పోటీపై స్పందిస్తూ.. జగన్ నాకు దోస్త్ అని.. మజ్లిస్ పోటీ చేస్తే జగన్ కి నష్టం జరుగుతుందని, జగన్ కి వ్యతిరేఖంగా పోటీ ఉండదని అన్నారు. నరేంద్ర మోడీని టెర్రరిస్టు అన్న చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాజ్ పేయ్ కి సపోర్టు చేశానని.. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కొనసాగుతున్నామని అన్నారు. కానీ, 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు బీజేపీతో ఉన్నాడని, ఎన్డీఏ నుంచి బయటకి వచ్చాక మోడీని టెర్రరిస్టు అని తిట్టి, మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడని తెలిపారు. ఇలాంటి వారిని ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. అలాగే ఏపీ ఎన్నికల్లో మైనారిటీలు, గిరిజనులు, ఆదివాసీలు కీ రోల్ ప్లే చేయబోతున్నారని, రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూడాలన్నారు. అంతేగాక మైనారిటీల ఆదివాసీల ఓట్లు బీజేపీ, టీడీపీ కూటమికి పడవని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.