విశాఖ: కొంతమంది పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అబద్ధమని, ఇదంతా రాజకీయ కుట్ర అని కొట్టి పారేశారు. అలాగే 2000 నోట్ల రద్దు పై కూడా స్పందించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటుకు రెండు వేల రూపాయలు పంచిపెట్టారని ఆరోపించారు. పెద్దనోట్ల వల్ల ఎదురయ్యే సమస్యలు గుర్తించే తాను ఆర్.బి.ఐ, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానన్నారు.
ఇక వాలెంటీర్ వ్యవస్థ ద్వారా నోట్లు చెలామణీకి ప్రయత్నాలు జరుగుతాయని ఆరోపించారు. లిక్కర్ షాపుల్లో 2వేల రూపాయల చెలామణిపై వ్యవస్థలు దృష్టి సారించాలని కోరారు. డబ్బులు ఆశ చూపించి ఓట్లు కొనుక్కుందామని చూసే పార్టీలకు నోట్ల రద్దు తో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అన్నారు. బ్లాక్ మనీ ఉన్నవాళ్ళకు తప్ప 2000 నోట్ల ఉపసంహరణ వల్ల సామాన్యులకు ఎటువంటి నష్టం లేదన్నారు.