రాజధాని విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు జగన్‌తో నాటకం ఆడుతోందా? ఇక్కడ జరుగుతున్న పరిణాలు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తోందా? పరోక్షంగా జగన్ సర్కారును ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి దేశంలో ఏ రాజధాని ఏర్పాటుకూ జరగని గౌరవం అమరావతిలో ప్రధానిగా నరేంద్ర మోడీకి దక్కింది. ఆయన చేతుల మీదుగా ఇక్కడ రాజధాని ఏర్పాటుకు శంకు స్థాపన జరిగింది. నేరుగా మోడీతోనే శంకుస్థాపన చేయించడం వెనుక రాజకీయంగా కూడా అప్పట్లో చంద్రబాబు లబ్ధి పొందాలని అనుకున్నారు.
అప్పట్లో బీజేపీతో కలిసి ఉన్న చంద్రబాబు.. మోడీని మచ్చిక చేసుకున్న చంద్రబాబు.. రాజధానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు సేకరించాలని అనుకున్నారు. అయితే, రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు పరోక్షంగా చంద్రబాబు గండి కొడుతున్నారనే కొందరి ఫిర్యాదులతో మోడీ.. తర్వాత కాలంలో బాబును పక్కన పెట్టారు. ఇక, ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఆయనకుకానీ, కేంద్ర ప్రభుత్వానికి తెలియవని అనుకోలేం. మరీ ముఖ్యంగా కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఏపీ రాజధాని విషయంలో ఏం జరుగుతుందనే విషయాన్ని అన్ని విధాలా పసిగడుతూనే ఉంటాయి.
అయినప్పటికీ.. ప్రధాన మంత్రి కార్యాలయం మాత్రం రాజధాని అమరావతి విషయంలో ఏం జరుగుతోందో తెలియనట్టే వ్యవహరిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల రాజధాని అమరావతి ఉద్యమ జేఏసీ గౌరవాధ్యక్షుడు జీవీఆర్ శాస్త్రి.. ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పీఎంవో అసలు అక్కడ ఏం జరుగుతోందో తమకు వివరంగా చెప్పాలని శాస్త్రిని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి తల్లిపుట్టిల్లు మేనమామకు తెలియదా? అనేదే ఇక్కడ ప్రశ్న. రాజధాని విషయంలో మోడీకి, అమిత్ షాకు తెలియకుండా ఏం జరుగుతుంది?
అయినప్పటికీ.. వివరాలివ్వండి.. మేం చూసుకుంటాం.. అని పీఎంవో అధికారులు కోరడం.. ఇక్కడ శాస్త్రిగారు దీనిని పెద్దది చేసి ప్రచారం చేయడం వెనుక సీఎం జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాల్సిన అవసరమే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. కొన్నాళ్ల కిందట.. పార్లమెంటులో కేంద్ర మంత్రి ఒక విషయం చెప్పారు. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఈ విషయంలో గతంలో చంద్రబాబు చెప్పిన విషయానికి ఊకొట్టాం.. ఇప్పుడు జగన్ చేసిన దానికి కూడా ఊకొడతాం అని పేర్కొంది. అయినప్పటికీ.. ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు వివరాలు కోరడం.. జగన్నాటకమేనని అంటున్నారు పరిశీలకులు.