నాడు వ‌ద్ద‌ని.. నేడు ముద్ద‌ని.. ఏం బాబూ ఈ రాజ‌కీయం..!

-

“మాదొక ప్ర‌భుత్వం.. మీ దొక ప్ర‌భుత్వం.. మీ ఇష్టాలు ఇక్క‌డ చెల్ల‌వు. సీబీఐని మీ ఇష్టానుసారంగా వాడుకుంటారా ?  ఆ సంస్థ‌ను ఏపీపై పుర‌మాయించి దాడులు చేయిస్తారా ?“-అంటూ.. సీఎంగా ఉన్న స‌మ‌యంలో కేంద్రంలోని ఇదే న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డిన చంద్ర‌బాబు ఒక్క‌సారిగా ప్లేట్ ఫిరాయించారు. త‌న ప్ర‌భుత్వ హ‌యాంలో చంద్ర‌బాబు.. త‌న పార్టీకి చెందిన కొంద‌రు నేత‌ల‌పై సీబీఐ దాడులు చేస్తోంద‌ని తెలిసి కుమిలి పోయారు. వెంట‌నే ఆయ‌న సీబీఐ స‌హా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఏపీలోకి అడుగు పెట్టాలంటే ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నేలా పాత చ‌ట్టాన్ని తిర‌గ‌దోడారు. ఫ‌లితంగా సీబీఐ వంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు స్వతంత్రించి ఏపీలోకి అడుగు పెట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

త‌ర్వాత నాడు కేంద్ర ప్ర‌భుత్వంపై గ‌రంగ‌రం లాడిన బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సైతం ఇదే రూటు ఫాలో అయ్యారు. దీనిపై దేశవ్యాప్త చ‌ర్చ‌కు బాబు కార‌ణ‌మ‌య్యారు. అయితే,చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు. ప్ర‌తి విష‌యానికీ ఆయ‌న ఇప్పుడు ప‌ఠిస్తున్న మంత్రం సీబీఐ. రాష్ట్రంలో ఏం జ‌రిగినా..సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌నేది బాబు వ్యూహం. అయ్యా మీరే క‌దా.. ఒక‌నాడు .. సీబీఐపై నిప్పులు చెరిగారు. అది స్వతంత్ర సంస్థే అయిన‌ప్ప‌టికీ.. దానిని న‌డిపించేది కేంద్ర ప్ర‌భుత్వ‌మేన‌ని చెప్పారు. మ‌రి అలాంటి మీరు ఇప్పుడు ఎందుకు సారూ.. సీబీఐ ద‌ర్యాప్తులు కోరుతున్నార‌న్న ప్ర‌శ్న‌లు మేథావులు, విశ్లేష‌కుల నుంచి వ‌స్తున్నాయి.

దీనికి బాబు అండ్ క్యాంప్ నుంచి వ‌స్తోన్న ఆన్స‌ర్ ఏంటంటే అప్పుడు మోడీ వేరు.. ఇప్పుడు మోడీ వేరు.. అని చెబుతున్నారు. అప్ప‌ట్లో త‌న‌పై క‌త్తిక‌ట్టార‌ని, ప్ర‌త్యేక హోదాను అడిగి.. బీజేపీ కంట్లో న‌లుసుగా మారాన‌ని , అందుకే త‌న‌ను దూరం పెట్టి,, త‌న పార్టీని క‌కావిక‌లం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని అంటారు. అంతేకాదు, త‌న‌పై కుట్ర‌లో జ‌గ‌న్ పాత్ర కూడా ఉంద‌ని.. అందుకే తాను దీనిని అడ్డుకున్నాన‌ని.. ఇది రాష్ట్రం కోస‌మే త‌ప్ప‌.. త‌న కోసం కాద‌ని చంద్ర‌బాబు లెక్చ‌ర్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నార‌ట‌.

ఇక‌, ఈ క్ర‌మంలోనే నెల్లూరు ద‌ళిత యువ‌కుడి మ‌ర‌ణం, తూర్పుగోదావ‌రి జిల్లా శిరోముండ‌నం వంటి ఘ‌ట‌న‌ల‌పై తాను ఒక‌ప్పుడు తిప్ప‌కొట్టిన సీబీఐతోనే విచార‌ణ చేయించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేయ‌డం పాత‌పాట‌. ఇప్పుడు తాజాగా అంత‌ర్వేదిలో ర‌థం ఆహుతి కావ‌డంపైనా ఆయ‌న సీబీఐ విచార‌ణ‌కు డిమాండ్‌చేయ‌డం స‌ర్వ‌త్రా హాస్యం సృష్టిస్తోంది. ఆయ‌న‌తోపాటు ఆయ‌న కుమారుడు, లోకేష్ కూడా అంత‌ర్వేది ఘ‌ట‌న‌పై సీబీఐని విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోర‌డం.. న‌వ్విపోదురుగాక‌.. అనే సామెత‌ను గుర్తు చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news