రాజకీయాల్లో ఎప్పటికి ఏది అవకాశంగా ఉంటే.. దానిని ప్రత్యర్థులు వినియోగించుకుంటారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీపై ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎప్పటికప్పుడు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిణామమే ఏపీలోనూ చోటు చేసుకుంది. ఏం జరిగినా.. వైసీపీకి ముడిపెడుతూ.. విమర్శలు చేయడంలో చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు ముందున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ ప్రమేయం, వైసీపీ నేతల ప్రమేయం లేకుండానే కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరికొన్నింటిలో నేతల ప్రమేయాన్ని కూడా తోసిపుచ్చలేం.
దీంతో ఆయా పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న టీడీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం .. దళితులు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, శిరోముండనం ఘటనలు పెరిగిపోయాయని.. ఇవన్నీ కూడా ప్రభుత్వంలోని పెద్దల కనుసన్నల్లోనే సాగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నారు. నిజానికి శిరోముండనం ఘటనలే తీసుకుంటే.. విశాఖలోని నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన ఘటనకు ప్రభుత్వానికి, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు.
అదేవిధంగా నెల్లూరులో ఓ దళిత యువకుడిపై సీఐ ప్రతాపం చూపించడం వెనుక కూడా పార్టీకి , ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినప్పటికీ.. చంద్రబాబు ఈ ఘటనలను వైసీపీకి పులమడానికి ప్రయత్నించారు. ఈ విషయంలో ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా కూడా గట్టి పాత్ర పోషించింది. ఇలాంటి సమయాల్లో పటిష్టంగా వ్యవహరించాల్సిన వైసీపీ నాయకులు సరైన పాత్ర పోషించలేక పోయారనే వాదనబలంగా వినిపిస్తోంది. చంద్రబాబు వ్యూహాన్ని వారు అందిపుచ్చుకున్నా.. వ్యతిరేకించే విషయంలో మాత్రం ఎక్కడో వెనుకాడారనే సందేహాలు వస్తున్నాయి.
వైసీపీకి సానుకూలంగా ఉన్న దళితులను దూరం చేయడం ద్వారా తాను లబ్ధి పొందేందుకు బాబు వేస్తున్న ఉపాయాలకు విరుగుడు మంత్రాలు వేయడంలో వైసీపీ నాయకులు విఫలమవుతున్నారనే అంటున్నారు పరిశీలకులు. మరి ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే.. దళిత ఓటు బ్యాంకుపై ప్రభావం ఖచ్చితంగా పడుతుందని చెబుతున్నారు. ఇదే విషయంపై చర్చిస్తున్న వైసీపీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
-vuyyuru subhash